
నల్లకుంట పోలీస్‌స్టేషన్ ముందు అంజన్‌కుమార్ అనుచరుల హంగామా
యువజన కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త జగడానికి వేదికవుతోంది.
* సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రోజుకో వివాదం
* గురువారం నల్లకుంటలో మాజీ ఎంపీ అంజన్ కుమారుడు, మరోవర్గం బాహాబాహీ
* ఎన్ కన్వెన్షన్ ఘటనకు సంబంధించి విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్ట్‌కు పోలీసుల యత్నం
* అజ్ఞాతంలోకి వెళ్లి.. ముందస్తు బెయిల్‌కు యత్నం
సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త జగడానికి వేదికవుతోంది. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఘర్షణకు దారితీయగా... గురువారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోకజవర్గంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.
ముషీరాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు అంశంలో స్థానిక నాయకుడు విజయ్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. దీనిపై సమాచారం అందిన నల్లకుంట పోలీసులు.. అనిల్‌కుమార్ సహా మరికొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హడావుడి, హంగామా నెలకొంది. నేతలతో పాటు పోలీసులు కూడా ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి అక్కడే తాత్కాలికంగా రాజీ కుదిర్చారు. లోకాయుక్తలో కేసులు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. యువజన కాంగ్రెస్‌లో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ రెండు వేర్వేరు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో జరిగే యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసే లక్ష్యంతో అనిల్‌కుమార్ తన అనుచరులతో సభ్యత్వ నమోదు చేపట్టారు.
మరోవైపు వంశీచంద్‌రెడ్డి తనవైపు నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌ను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ వర్గీయులు విష్ణువర్ధన్‌రెడ్డి, అంజన్ అనిల్‌కుమార్‌యాదవ్‌ల వ్యతిరేక శిబిరాలను చేరదీసి సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తమ వ్యతిరేకులను వంశీచంద్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో.. విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనపైనే దాడికి పాల్పడ్డారని, నల్లకుంటలోనూ విజయ్, అనిల్ వర్గాల మధ్య ఘర్షణకు కారణమని యువజన కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య ఘర్షణలో తప్పు విష్ణుదేనని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విష్ణు... ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.