రాళ్లలో రాక్షస బల్లి! | Sakshi
Sakshi News home page

మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి డైనోసార్‌ శిలాజాలు

Published Wed, May 22 2019 1:50 AM

Ancient Dinosaur Fossils Found In Mancherial - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డైనోసార్‌.. ఈ పేరు వినగానే కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి ఆ తర్వాత కనుమరుగైన రాక్షస బల్లులని అందరూ ఠక్కున చెబుతారు. మరి అవి తిరుగాడిన ప్రాంతాల గురించి అడిగితే మాత్రం మనలో చాలా మంది తెలియదనే బదులిస్తారు. అయితే మన దేశంలో ప్రత్యేకించి పూర్వపు ఆదిలా బాద్‌ జిల్లాలోని ప్రాణహిత–గోదావరి నదీ తీరాలు డైనోసార్లకు స్వర్గధామంగా ఉండేవన్న విషయం తెలుసా? ఆశ్చర్యంగా అని పిస్తున్నా ఇది నిజం. ఇంతకంటే విస్తుగొలిపే విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. డైనోసార్‌ శిలాజాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. డైనోసార్లే కాదు, ఆ కాలంలో జీవించిన ఇతర ప్రాణుల శిలాజాలు కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసినా ఆ తర్వాత పరిశోధనలు నిలిచిపోవటంతో ఈ విషయం కాస్తా మరుగున పడిపోయింది. ఇప్పుడు తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు ప్రస్తుత మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి (వేమన్‌పల్లి) చుట్టుపక్కల పరిశీలించినప్పుడు డైనోసార్‌తోపాటు ఇతర ప్రాణులకు చెందిన శిలాజాలుగా భావిస్తున్న భాగాలు కనిపించాయి.

వంతెన రాళ్లలో శిలాజాలు...
ఇది మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి శివారులో నిర్మించిన వంతెన. ఈ బ్రిడ్జి రివెట్‌మెంట్‌కు వినియోగించిన రాళ్ల మధ్యలో ప్రత్యేకంగా కనిపిస్తున్న రాళ్ల ఆకారాలను పరిశీలిస్తే అవి డైనోసార్‌ శిలాజాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆ ప్రాంతాన్ని ఔత్సాహిక పరిశోధక బృందంలోని çసముద్రాల సునీల్, పులిపాక సాయిలు పరిశీలించినప్పుడు రివెట్‌మెంట్‌ రాళ్ల మధ్య శిలాజాలను పోలినవి కనిపించాయి. శాస్త్రీయ నిర్ధారణ కోసం వాటి ఫొటోలను పుణె డెక్కన్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఎల్‌. బాదామ్‌కు పంపగా ఆయన పరిశీలించి అందులో దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన ఓ జాతి తాబేలు శిలాజంగా గుర్తించారు. మిగతా రాళ్లలో కూడా డైనోసార్‌ శిలాజాలకు దగ్గరి పోలికలున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వయంగా పరిశీలించి పరిశోధిస్తే కచ్చితత్వం వస్తుందని వెల్లడించారు. అయితే పరిశోధనలు లేకపోవడం, భవిష్యత్తు అధ్యయనాలకు వీలుగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించకపోవడంతో ఈ శిలాజాలు వేగంగా ధ్వంసమవుతున్నాయి.

రాక్షసబల్లి రెండో ఆకృతి ఇక్కడిదే...
ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన వాటి జీవిత విశేషాలపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ డైనోసార్లు అన్ని ప్రాంతాల్లో లేవు. మన దేశంలోని గుజరాత్, రాజస్తాన్‌లలో వాటి జాడ ఉండేదని వెలుగుచూడగా ఆ తర్వాత మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రాణహిత–గోదావరి తీరాల్లో జాడ కనిపించినట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ప్రత్యేకార్షణగా ఉన్న ‘డైనోసారియం’లో కనిపించే భారీ రక్షాసబల్లి ఆకృతి యామన్‌పల్లి ప్రాంతంలో లభించిన డైనోసార్‌ అవశేషాలతో రూపొందించినదే. 44 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తున్న ఈ అస్తిపంజరం యామన్‌పల్లిలో 1974–1980 మధ్య జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఖనిజాన్వేషణలో దొరికింది. 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలను అప్పట్లో వెలికితీశారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్‌ యమనపల్లిన్సిస్‌’ అనే పేరుపెట్టారు.

కానరాని పరిశోధనలు...
ఆంగ్లేయుల జమానాలోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ఈ ప్రాంతంలో ఖనిజాన్వేషణ సమయంలో డైనోసార్‌ శిలాజాలను గుర్తించింది. ఆ సమయంలో కొందరు విదేశీ పరిశోధకులు కూడా వచ్చి ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. ఆ తర్వాత జీఎస్‌ఐ అడపాదడపా పరిశోధనలు తప్ప ప్రత్యేకంగా అధ్యయనాలు లేకుండా పోయాయి. 1980లలో జీఎస్‌ఐకి చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి ఇక్కడే ఎగిరే రాక్షసబల్లి అవశేషాలను గుర్తించారు. ఆ తర్వాత కొత్త విషయాలేవీ వెలుగు చూడలేదు. గోదావరి బేసిన్‌ పరిధిలోని మలేరి, ధర్మారం, కోటలలో ఇప్పటి వీటి అవశేషాలు లభించాయి. డైనోసార్‌ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకులు, ఎముకలు, అప్పటి చేపలు, తాబేళ్లు, మొసళ్ల శిలాజాలు కనిపించాయి. మహారాష్ట్ర–తెలంగాణల్లో విస్తరించిన ప్రాణహిత–గోదావరి తీరాల్లో ఆంజియోస్పర్మ్‌ చెట్లు విస్తృతంగా ఉండటంతో వాటి ఆకులను తినేందుకు ఈ ప్రాంతాల్లో డైనోసార్లు ఎక్కువగా ఉండేవని పరిశోధకులు గుర్తించారు. 

మరి వారు స్మగ్లర్లా...?
డైనోసార్‌ అవశేషాల అధ్యయనం పేరు చెప్పి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలా తవ్వగా ఏర్పడ్డ పెద్ద గొయ్యిని ఆ కోవదేనని పేర్కొంటున్నారు. ఇప్పటికీ వ్యవసాయ పనుల కోసం దున్నుతున్నప్పుడు డైనోసార్‌ శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. వాటిపై కొంత అవగాహన ఉన్నవారు ఆ శిలాజాలను సేకరించి అన్వేషణకు వచ్చే ‘స్మగ్లర్ల’తో బేరసారాలు సాగిస్తున్నారని సమాచారం. ఇటీవల కొందరికి ఈ ప్రాంతంలో డైనోసార్‌కు చెందిన భారీ ఎముకల శిలాజాలు దొరికాయని, వాటిని దాచి ఆసక్తి ఉన్న వారికి అమ్మకం కోసం యత్నిస్తున్నారని సమాచారం.

శిలాజాలు ఎలా...
డైనోసార్లు దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం సంచరించాయి. ప్రకృతి విపత్తులతో అవి అంతరించాయి. కానీ కోట్ల ఏళ్ల కాలంలో వాటి కళేబరాలు, గుడ్లు శిలాజాలుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా ప్రవహించి అవి రాళ్లుగా మారిపోయాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement