అక్కడి వారిక్కడ.. ఇక్కడి వారక్కడ

Allotted ITI Examination Centers - Sakshi

     ఇష్టారాజ్యంగా ఐటీఐ పరీక్ష కేంద్రాల కేటాయింపు

     ఒక్కో విద్యార్థి నుంచి రూ. 6 వేల వరకు వసూళ్లు

     ముందస్తుగా మాట్లాడుకున్న యాజమాన్యాలు

     పరీక్ష రాస్తున్న 58,300 మంది విద్యార్థులు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ‘‘మా విద్యార్థులు మీ కళాశాలలో పరీక్ష రాస్తారు.. మీ విద్యార్థులు మా కళాశాలలో పరీక్ష రాస్తారు.. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మా వారికీ అక్కడ ఏమీ ఇబ్బంది ఉండవద్దు’ ఇదీ.. ప్రైవేటు ఐటీఐ కళాశాల యాజమా న్యాల ముందస్తు ఒప్పందం. డైరెక్టరేట్‌ జనరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ (డీజీఈటీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ట్రైనింగ్‌ (డీజీటీ)ల ఆధ్వ ర్యంలో ఇండస్ట్రియల్‌ ట్రెనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐటీఐ) పరీక్షలు నిర్వ హిస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేట్‌ ఐటీఐలు 222 ఉన్నాయి. వీటిలో 58,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్‌ పరీక్షల కోసం 125 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ముందస్తు ఒప్పందం ప్రకారం పరీక్షలు చూచిరాతను తలపిస్తున్నాయి.

పరస్పర ఒప్పందంతో..
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని విద్యార్థి ఐటీఐ, విన్‌సెంట్‌ ఐటీఐ విద్యార్థులకు శ్రీ రాజీవ్‌ గాంధీ ప్రైవేట్‌ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. శ్రీ రాజీవ్‌ గాంధీ ఐటీఐకి చెందిన విద్యార్థులకు విన్‌సెంట్‌ ప్రైవేట్‌ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మ్యూచువల్‌ చేంజ్‌గా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగానే ఉన్నతాధికారులతో ఒప్పందం కుదుర్చుకుని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయించుకున్నారు. మా విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తే ఇక్కడ మీ విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు.

గతంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారులతో ప్రైవేట్‌ యాజమాన్యాలు కుమ్మక్కై మ్యూచు వల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్‌ ఐటీఐలకు సెల్ఫ్‌ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మ్యూచువల్‌ చేంజ్‌తో కేం ద్రాలు ఏర్పాటు కావడంతో జోరుగా మాస్‌కాపీయింగ్‌ జరు గుతోంది. పరీక్ష కేంద్రంలో కనీస నియమాలు సైతం పాటించడం లేదు. జంబ్లింగ్‌ కాకుండా ఒకే ట్రేడ్‌ వారిని పక్కపక్కన కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తు న్నారు. కనీస సౌకర్యాలు లేకు న్నా సైతం కొన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని వీఎన్‌ఆర్‌ ఐటీఐలో సాధారణ కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు రాయిస్తున్నారు. ఆ ఐటీఐ భవనం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు.

పైసా వసూల్‌
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు చూసి రాసుకునేందుకు ప్రైవేట్‌ ఐటీఐల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. పైసలు ఇస్తే పాస్‌ గ్యారంటీ పేరుతో ప్రైవేట్‌ ఐటీఐలు డబ్బులు వసూల్‌ చేస్తు న్నాయి. సెంటర్‌ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూళ్లు చేసినట్లు తెలిసింది. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఏకంగా బోర్డుల పైనే జవాబులు రాస్తున్నారు.  ఐటీఐ చేసిన వారికి ట్రాన్స్‌కో, జెన్‌ కో, సింగరేణిలో ఉద్యోగ అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు కూడా పాస్‌ అవుతాం కదా అని డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడటంలేదని సమాచారం. విద్యార్థుల నుంచి వసూల్‌ చేసిన డబ్బులను పరీక్ష పర్యవేక్షకుడికి, ఉన్నత అధికారులకు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వని విద్యార్థులను మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top