కీలక దశకు ‘పొత్తు’ పొడుపు!

Alliances In Telangana - Sakshi

సీట్ల పంపకాలపై మహాకూటమి కసరత్తు

టీడీపీకి 13–15 స్థానాలు, టీజేఎస్‌కు 5, సీపీఐకి 3, ఇంటిపార్టీకి ఒక సీటు ఇచ్చే యోచనలో కాంగ్రెస్‌

చర్చలు పూర్తి చేసుకుని రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం

సీట్ల సంఖ్యలో మార్పులుంటాయంటున్న ఇతర పార్టీలు

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న మహాకూటమిలోని పార్టీల మధ్య చర్చలు కీలకదశకు చేరుకున్నాయి. ప్రాథమికంగా జరిగిన చర్చల అనంతరం మహాకూటమిలోని పార్టీలుగా పేర్కొంటున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి తాము పోటీచేయాలనుకుంటున్న స్థానాల జాబితాలను పంపాయి. తమ పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలపై కాంగ్రెస్‌ ముఖ్యులు చర్చించారని, మరోమారు ఇతర పార్టీలతో చర్చించి సీట్ల పంపకాలను పూర్తి చేసుకుని, రెండు లేదా మూడు రోజుల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేయబోతోందనే విషయంపై అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.  

28 నియోజకవర్గాలతో టీడీపీ ప్రతిపాదన 
కాగా, తమకు కనీసం 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని కోరుతున్న తెలుగుదేశం పార్టీ 28 నియోజకవర్గాలతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీకి పంపింది. ఇందులో కీలక నేతల విషయంలో పీటముడి పడే అవకాశం ఉన్న చోట్ల రెండు నియోజకవర్గాలను ప్రతిపాదించింది. టీడీపీ ప్రతిపాదించిన ఈ జాబితాలో ఉప్పల్, కూకట్‌పల్లి, కోదాడ, ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, పఠాన్‌చెరువు, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ నియోజకవర్గాలున్నాయి. వీటికి తోడు ముఖ్యనేతల కోసం రెండు నియోజకవర్గాల చొప్పున పేర్లను కూడా పంపింది. అందులో నకిరేకల్‌/తుంగతుర్తి, నర్సంపేట/పరకాల, వరంగల్‌ ఈస్ట్‌/ వరంగల్‌ వెస్ట్, హుజూరాబాద్‌/హుస్నాబాద్, జగిత్యాల/కోరుట్ల, వనపర్తి/దేవరకద్ర, మక్తల్‌/నారాయణ పేట్, సికింద్రాబాద్‌/సనత్‌నగర్‌ నియోజకవర్గాలున్నాయి. ఈ జాబితాపై శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చర్చించారు. అయితే, టీడీపీ అడిగిన స్థానాలన్నింటినీ ఇవ్వలేమని, తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున 13–15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ అంటోంది. తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను టీడీపీ నేతలకు పంపుతామని, దీనిపై మరోమారు చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

20 స్థానాలతో టీజేఎస్‌ 
ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా 20 స్థానాలతో తమ జాబితాను కాంగ్రెస్‌ పార్టీకి పంపినట్టు తెలుస్తోంది. అయితే, జనసమితికి 5 స్థానాల కన్నా ఎక్కువ ఇవ్వలేమని, కోదండరాం నేతృత్వంలో అమరవీరుల ఆకాంక్షల కమిటీకి ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ కారణంగా టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న లక్ష్యం నెరవేరాలంటే టీజేఎస్‌ కొంత త్యాగం చేయకతప్పదని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్‌గిరి, తాండూరు, ముదోల్, చెన్నూరు, వరంగల్‌వెస్ట్, దుబ్బాక, సిద్దిపేట, వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాల విషయంలో ఇరు పార్టీల మధ్య మరోమారు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీపీఐ కూడా తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్నా ఆ పార్టీకి 3 సీట్లు ఇవ్వగలమని కాంగ్రెస్‌ అంటోంది. అందులో హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, దేవరకొండ, వైరా నియోజకవర్గాలున్నట్టు సమాచారం. తెలంగాణ ఇంటిపార్టీ కూడా 2 స్థానాలు కోరుతోంది. మహబూబ్‌నగర్, నకిరేకల్‌ స్థానాలు తమకు కావాలని ఆ పార్టీ నేతలు అడుగుతున్నా రెండింటిలో ఒకటి మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు అన్ని పార్టీలతో చర్చించి ఏ పార్టీ, ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీచేస్తుందో నిర్ణయం తీసుకుంటామని, రెండు లేదా మూడు రోజుల్లో ఈ చర్చలు కొలిక్కి వస్తాయని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.  

తరచూ చర్చలు... 
 మహాకూటమి ఏర్పాటు, మార్గదర్శకాల రూపకల్పన, ఉమ్మడి ఎజెండా తయారీ, సీట్ల పంపకాలపై కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆయా పార్టీల నేతలకు వీలున్నప్పుడల్లా కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని సమావేశాల వివరాలను మీడియాకు చెబుతుండగా, చాలావరకు రహస్యంగానే కలుస్తూ చర్చించుకుంటుండటం గమనార్హం. ఈ క్రమంలోనే సీట్ల పంపకాల వరకు చర్చల ప్రక్రియ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం మీద ఎలాంటి పీటముడి పడకుండా ఉంటే మూడు రోజుల్లో మహాకూటమిలోని ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top