జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

All Political Parties Are Mulling Victory Over Municipal Elections - Sakshi

సాక్షి , వరంగల్‌ : ఓ వైపు పలు మునిసిపాలిటీలకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. మరోవైపు మునిసిపల్‌ సంస్కరణలకు నో చెప్పిన గవర్నర్‌ నరసింహన్‌.. ఇంకోవైపు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకున్నా మొదలైన రాజకీయ సందడి! వెరసి ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనవే అన్నట్లుగా ఎవరికి వారు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘నువ్వక్కడ.. నేనక్కడ.. మన పార్టీ అధ్యక్షుడు ఫలానా వార్డు.. ఎస్సీ రిజర్వు అయితే ఆయన.. మహిళకు కేటాయిస్తే ఆయన భార్య.. బీసీ, జనరల్‌ అయితే ఫలానా వాళ్లు’ అంటూ అప్పుడే సమీకరణలు, వార్డు సభ్యులు, మునిసిపల్‌ చైర్మన్‌ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు కూడా షికారు చేస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన కోసం రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... మరోవైపు పట్టణ పాలక వర్గాల్లో పాగా వేయాలని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం కాగా.. రిజర్వేషన్ల ప్రకటన వెలువడడమే ఆలస్యం అన్నట్లుగా మారింది. అయితే, భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుండగా ఇక్కడ ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అన్నీ ‘గులాబీ’కే దక్కాలి..
ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పలు దఫాలుగా ఎన్నికలపై చర్చించారు. అన్ని మునిసిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేయాల ని పార్టీ కేడర్‌కు సంకేతాలి చ్చారు. ఈనెల 20 పెరిగిన ఆసరా ఫించన్‌ ప్రొసీడింగ్‌లు అందజేసే సమయంలో మునిసిపాలిటీల పరిధిలో సభ్యత్వ నమోదు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నిర్దేశించింది. పూర్వ వరంగల్‌ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన అధినేత.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు కూడా మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. ఆరు జిల్లాలకు విడివిడిగా బాధ్యులను కూడా టీఆర్‌ఎస్‌ తరఫున నియమింఆరు. వీరు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తంగా జిల్లాకు బాధ్యులుగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఫోన్‌ ద్వారా ఏ రోజుకారోజు సమీక్ష జరుపుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

సంగారెడ్డి సమావేశంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం
జిల్లా కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నేతలతో మున్సిపల్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఇటీవల సంగారెడ్డిలో సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర బాధ్యులు కుంతియా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క తదితరులు హాజరుకాగా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యే సీతక్క, పి.వీరయ్య పాల్గొన్నారు.

మున్సిపల్‌ చట్టంలోని లోటుపాట్లు, బీసీల రిజర్వేషన్లు, అభివృద్ధి, సంక్షేమం పేరుతో అధికార పార్టీ తరఫున జరుగుతున్న తప్పులను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఉమ్మడి వరంగలో జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లను కూడా నియమించింది. ములుగు ఎమ్మెల్యే స్థానం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోగా.. పూర్వ వరంగల్‌ జిల్లాలోని మిగిలిన 11 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఇన్‌చార్జ్‌లు మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్‌ పెద్దలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, విలీనం చేయడం తదితర విషయాలను కూడా మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దీంతో వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ జిల్లాల అధ్యక్షులు పార్టీ కేడర్‌తో సమావేశం ఏర్పాటు చేయగా, మిగతా జిల్లాల్లోనూ జరుగుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో గట్టిగానే తలపడాలని ‘హస్తం’ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

మెజార్టీ మునిసిపాలిటీలపై బీజేపీ గురి
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు సీట్లు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పూర్వ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్‌ నేతలు వరంగల్‌ అర్బన్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి ఇటీవల రెండు రోజుల పాటు పూర్వ వరంగల్‌ జిల్లాలో పర్యటించారు.

దీంతో ఆ పార్టీ ఆరు జిల్లాల అధ్యక్షులు, పట్టణ కమిటీలు మరింత ఉత్సాహంగా మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ పార్టీల సీనియర్‌ నాయకులు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పరకాల, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, వర్ధన్నపేట తదితర మున్సిపాలిటీలపై గురి పెట్టిన బీజేపీ.. అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉండగా తాజా పరిస్థితుల ప్రకారం సీపీఐ, సీపీఎం, టీడీపీ తదితర పార్టీలు వారి ప్రాబల్యం ఉన్నచోట పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం
మున్సిపాలిటీ ఎన్నికలకు ఉమ్మడి వరంగల్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఎన్నికల నిర్వహణకు సిద్ధమే అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 మున్సిపాలిటీలకు షెడ్యూల్‌ ప్రకారం ఎన్ని కల నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో పలు ముని సిపాలిటీల్లో చోటు చేసుకున్న తప్పుల కారణంగా కొందరు కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇవ్వగా... పూర్వ వరంగల్‌లో ఒక్క భూపాలపల్లి లో ఆ పరిస్థితి ఎదురైంది.

ఈ మేరకు అభ్యంతరాలు లేని మిగిలిన ఎని మిది మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వార్డుల పునర్విభజన, డివిజన్ల వారీగా ఓటర్లకు లగణన, పోలింగు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాలపై ముసాయిదా జాబితాను ప్రకటించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం వాటికి సంబంధించిన తుది జాబితా ప్రకటించారు.

ఆ జాబితా ప్రకారమే అధికారులు ఎన్నికలకు వెళ్లనున్నారు. పోలింగ్‌ కేం ద్రాల వారీగా ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికా రుల జాబితాను సిద్ధం చేశారు. రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top