నేతలొస్తున్నారు..

All Party Heads Are Coming To District - Sakshi

29, 30న కేసీఆర్‌ సభలు

డిసెంబర్‌ ఒకటిన రేవంత్‌రెడ్డి!

త్వరలో అమిత్‌షా, పరిపూర్ణానంద

సాక్షి, పెద్దపల్లి : ప్రచారపర్వానికి గడువు సమీపించడంతో అన్నిపార్టీల అధినేతలు జిల్లాబాట పట్టారు. ఇప్పటివరకు ఆయా పార్టీలకు సంబంధించిన నేతల సభలు జరగకపోగా, వరుసగా అన్ని పార్టీల నేతలు ఒకేసారిగా ప్రచారం రానుండడంతో రాజకీయం వేడెక్కనుంది. పోలింగ్‌కు పదిరోజుల ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జోష్‌ నింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 29, 30న జిల్లాలో పర్యటించనున్నారు. 29న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని జూనియర్‌కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొంటారు. 30న మధ్యాహ్నం 3.15 గంటలకు మంథనిలో, సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 

ఈమేరకు మంగళవారం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. కాగా వరుసగా రెండు రోజులు జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనుండడంతో పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. రామగుండం, మంథని, పెద్దపల్లి అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో రెండు, మూడు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గంలో కేసీఆర్‌ బహిరంగసభలు నిర్వహించారు. కానీ.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం వరుసగా రెండు రోజులపాటు ప్రచార సభలు నిర్వహిస్తుండడం, అందునా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ బహిరంగసభలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. 

రేవంత్‌రెడ్డి...అమిత్‌షా...పరిపూర్ణానంద...
పార్టీ అధినేతలు, స్టార్‌కంపెయినర్‌లతో ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఈ నెల 30 లేదా డిసెంబర్‌ ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది. తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చింతకుంట విజయ రమణారావుకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌కు మద్దతుగా గోదావరిఖనిలోనూ పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి రావడంఖాయమే అయినా... తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు సినీనటి విజయశాంతి, ప్రజాకవి గద్దర్‌లు మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. 

మంథని పట్టణంలో విజయశాంతి, కాటారం మండల కేంద్రంలో గద్దర్‌ల సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సన్నహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇక బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, స్వామి పరిపూర్ణానందస్వామి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ రథసారథులను రప్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో అమిత్‌షా, పరిపూర్ణానందస్వామిల ప్రచార సభలు ఉండే అవకాశం ఉంది. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 4న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ గోదావరిఖనిలో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు వరుసగా జరగనుండడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top