
సాక్షి, కీసర : మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కిరణ్ శ్రేణికి చెందిన శిక్షణ విమానం హకీంపేట్ శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం శకలాలు కిందపడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఏం జరగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో శిక్షణ ఇస్తున్న పైలట్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అంకిరెడ్డిపల్లి శివారులో ఎస్‌ఎల్‌ఎస్ ఫ్యాక్టరీ సమీపంలో విమానం కూలింది. అయితే ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపల విమానం పూర్తిగా దగ్ధమైంది.







