
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని హిందూ మహాసభ కార్యకర్తలు గాంధీ విగ్రహాన్ని అవమానించినా ఇంతవరకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని, వెంటనే నింది తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత నెల 30న గాంధీ విగ్రహాన్ని హిందూ మహాసభ కార్యకర్తలు అవమానపర్చినందుకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి జరిగిన అవమానం భారత జాతికి జరిగిన అవమానమని అన్నారు. గాంధీ విగ్రహంపై దాడితోనే హిందూ మహాసభ బీజేపీ అనుబంధ సంఘమని తేలిపోయిందని అన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.