యాసిడ్‌ దాడులకు దిగితే.. యావజ్జీవ శిక్షే.!

Acid attacks Life is  Punishment  - Sakshi

జగిత్యాలజోన్‌ : మహిళలను నేరుగా ఎదుర్కోని కొందరు, తమకు దక్కనిది ఇంకొక్కరికి దక్కొద్దనే దురాలోచనతో ఉన్నవారు.. మహిళలపై, విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, యాసిడ్‌ దాడులకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్భయ చట్టం–2013 ద్వారా యాసిడ్‌ దాడులకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు ఉండేలా.. ఐపీసీ326 చట్టానికి సవరణలు చేసి.. ఐపీసీ326(ఏ), ఐపీసీ326(బీ) అనే కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు. వీటితో పాటు మరిన్ని క్రిమనల్‌ చట్టాల గురించి జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఎడ్మల నిరోషా వివరించారు.
తీవ్రమైన హాని చేస్తే..
అగ్ని, విష ప్రయోగం, వేడితో మరిగిన పదార్థాలు, యాసిడ్, పేలుడు పదార్థాలు, రక్తంలో కలిసిపోయే తీవ్రమైన హానికర పదార్థాలు, జంతువులు, కత్తి వంటి సాధానాల ద్వారా ఒక మనిషికి మరణం కలిగించే విధంగా.. ఉద్దేశపూర్వకంగా తీవ్రగాయాలు చేస్తే ఐపీసీ326 కింద నేరంగా పరిగణించబడుతోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేయవచ్చు. లేదా కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా వేసే అవకాశముంటుంది. 
యాసిడ్‌ వంటి పదార్థాలతో గాయపర్చడం.. 
ఎవరైనా ఎదుటి వ్యక్తిపై యాసిడ్‌ దాడి చేయడం లేదా ఇతర విధాలుగా దాడులు చేయడాన్ని ఐపీసీ326(ఏ)సెక్షన్‌ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ దాడుల ద్వారా సదరు వ్యక్తికి శాశ్వత లేదా పాక్షికంగా నష్టం లేదా శరీర భాగాలు వైకల్యం పొందడం లేదా అందవిహీనంగా తయారవడం జరుగుతోంది. ఇలాంటి నేరానికి పాల్పడితే జీవితకాల శిక్ష విధించే అవకాశముంది. కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల కాల వ్యవధితో జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ఇలాంటి కేసుల్లో ముద్దాయిలకు వేసే జరిమానాలు బాధితుల వైద్య ఖర్చులకు సరిపడే విధంగా న్యాయబద్దంగా ఆలోచించి కోర్టులు నిర్ణయిస్తుంటాయి. 
యాసిడ్‌ విసిరి శాశ్వత నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో..
ఒక వ్యక్తికి శాశ్వతమైన లేక పాక్షికమైన నష్టం లేదా అంగవైకల్యం లేదా తీవ్రమైన గాయం చేయాలనే ఉద్దేశ్యంతో యాసిడ్‌ను విసిరినా లేదా యాసిడ్‌ను విసురుటకు ప్రయత్నించినా ఐపీసీ326(బీ) సెక్షన్‌ కింద నేరంగా పరిగణిస్తారు.

ఆస్తిని పొందేందుకు గాయపర్చితే..
ఏదైనా ఆస్థిని లేదా విలువైన పత్రాలను బాధితుడి నుంచి బలవంతంగా లేదా బెదిరించడం, చట్టవిరుద్ధగా చేసే చర్యల వల్ల గాయాలైతే ఐపీసీ327 కింద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. 
విషంతో హాని కలిగిస్తే..
ఎవరైనా ఒక వ్యక్తికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం లేదా సృహ కోల్పోయే మత్తుమందును తాగించిన లేదా తాగించేలా చేసిన ఐపీసీ328 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. 
తీవ్రంగా గాయపర్చితే..
ఎవరినైనా ఉద్దేశ్యపూర్వకంగా బలవంతం చేసి, తీవ్రమైన గాయాలు చేస్తే ఐపీసీ329 కింద శిక్షలు కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా, ఏదైనా ఆస్తిని బాధితుడి నుంచి బలవంతంగా లాక్కునేందుకు బెదిరించినా నేరమే. ఈ నేరానికి పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా కేసును బట్టి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top