మృత్యు పిలుపు.. ఆ మూలమలుపు!

Accident Prone Area In Motkur Nalgonda District - Sakshi

     పాటిమట్ల వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు 

     ప్రమాదాలబారిన పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు 

సాక్షి,మోత్కూరు:మండలంలోని పాటిమట్ల గ్రామం శివారులో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మోత్కూరు నుంచి పాటిమట్ల చెరువుకట్ట వరకు రూ.10 కోట్లతో డబుల్‌ బీటీ రోడ్డును నిర్మించారు. పాటిమట్ల బృందావన్‌ కల్వర్టుపై నిర్మించిన రక్షణ గోడలు సరైన ఎత్తులో లేకపోవడం, ప్రమాదాల హెచ్చరికల బోర్డులు లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు వద్దే మూలమలుపు ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పల్టీ కొడుతున్నాయి. ఇటీవల డీసీఎం అదుపుతప్పి కాల్వలోకి పల్టీకొట్టింది. డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. 
రెండు నెలల్లో పది ప్రమాదాలు..
రెండునెలల క్రితం పూర్తయిన డబుల్‌ బీటీ రోడ్డుపై ఇప్పటికి పది ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు, ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాల్వర్టు నిర్మించకపోకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 4న మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం మోత్యాతండకు చెందిన ఇస్లావత్‌ సతీష్‌ అనే కారుడ్రైవర్‌ మూలమలుపు వద్ద కారు పల్టీకొట్టి అక్కడిక్కకడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా రెండునెలల కాలంలో వాహనాలు అదుపుతప్పి సుమారు 50 మందికి పై చిలుకు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరగకుండా రక్షణగోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.


కల్వర్టు పక్కన కాల్వలో పల్టీకొట్టిన కారు.

డీఈ వివరణ...
ఈ విషయమై డీఈ షహనాజీని వివరణ కోరగా.. రహదారిపై మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు  టెండర్లు పిలిచామని తెలిపారు. ఎన్నికల అనంతరం పనులను పూర్తిచేస్తామన్నారు. 

రెండు నెలల్లో పది ప్రమాదాలు
మూలమలుపు కల్వర్టు వద్ద, సమీపంలో సుమారు పది ప్రమాదాలు జరిగాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు, డీసీఎంలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. మా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనర్సింహారెడ్డి రెండు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.


– బండ సంజీవరెడ్డి, పాటిమట్ల

కల్వర్టు గోడ ఎత్తు పెంచాలి
మూలమలుపు వద్ద బృందావన్‌ కాల్వపై నిర్మించిన కల్వర్టు గోడలకు ఇరువైపులా ఎత్తు పెంచాలి. సుమారు వందమీటర్ల దూరం ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలి. దీంతో ప్రమదాలను నివారించవచ్చు.


–కుర్మెటి యాదయ్య , పాటిమట్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top