రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కలకలం

వరంగల్‌ ఆర్వో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం  - Sakshi

కాజీపేట అర్బన్‌: భూక్రయవిక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ మూడో ఖజానాగా పేరుగాంచిన రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతిని అరికట్టేందుకు గాను ఏసీబీ సోదాలు ప్రారంభించింది.æ ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. కాజీపేట నిట్‌ ఏరియాలోని వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షించి, రోజువారి చేపడుతున్న దస్తావేజుల వివరాలను ఆరా తీశారు. స్లాట్‌ బుకింగ్‌తో పాటు సామాన్య రిజిస్ట్రేషన్లను, వీఎల్‌టీ ఆధారంగా చేపట్టాల్సిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ల వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలతో తీవ్ర కలకలం రేగింది. కార్యాలయ సిబ్బందితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

డాక్యుమెంట్‌ రైటర్లపై నజర్‌
ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, భూకొనుగోలుదారుడు స్వయంగా దస్తావేజులను తయారు చేసుకునేందుకు పబ్లిక్‌ డేటా ఎంట్రీకి శ్రీకారం చుట్టింది. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికారు. కాగా, డాక్యుమెంట్‌ రైటర్లు చెప్పిందే ‘రైట్‌’ అంటూ పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్లుగా ఉద్యోగ విరమణ పొందిన కొందరు డాక్యుమెంట్‌ రైటర్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు తెరలేపుతున్నారు. ఏకంగా రిటైర్డ్‌ సబ్‌ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్‌ రైటర్లుగా మారుతున్నారంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వారి హవా తెలుసకోవచ్చు. వరంగల్‌ ఆర్వో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలోని డాక్యుమెంట్‌ రైటర్ల కార్యాలయాలను ఏసీబీ అధికారులు పర్యవేక్షించి రోజువారీ వివరాలపై కూపీ లాగినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top