జంపన్న మావోయిస్టు పార్టీ ద్రోహి

Abhay about jampanna - Sakshi

విలువలు కాలరాసి శత్రువుకు మోకరిల్లాడు

మీడియాకు లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌  

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్‌ జినుగు నర్సింహారెడ్డి పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. జంపన్నను మావోయిస్టు పార్టీ ద్రోహిగా అభివర్ణించింది. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ (పీడబ్ల్యూజీ)లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన జంపన్న మూడు దశాబ్దాలపాటు పార్టీలో పనిచేశారని, అలాంటి వ్యక్తి పార్టీపై చేసిన ఆరోపణలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యవహారంలా కనిపిస్తోందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఈ మేరకు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్టీలో ఉంటూ క్యాడర్‌ మనోస్థైర్యం కోల్పోయేలా జంపన్న వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్టీ సిద్ధాంతాల కోసం వేలాది మంది ప్రాణాలను అర్పించారని, అలాంటి పార్టీపై సైద్ధాంతిక విభేదాలతో బయటకు వచ్చానని చెప్పడం అభ్యంతరకరమన్నారు. ఒడిశా కమిటీ క్యాడర్‌తో జంపన్న వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు సూచించినా వినకుండా క్యాడర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా జంపన్న ప్రవర్తించాడని ఆరోపించారు.

అంతే కాకుండా కేంద్ర కమిటీ అప్పగించిన ఏ పని కూడా సరైన రీతిలో చేయకుండా విఫలమయ్యాడని, కొన్నేళ్ల నుంచి జంపన్న పనితీరుపై కేంద్ర కమిటీ అసంతృప్తిగా ఉందని అభయ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఏడాది క్రితమే కేంద్ర కమిటీ జంపన్నపై రెండేళ్లపాటు సస్పెన్షన్‌ వేటు వేసిందన్నారు. పార్టీ కమిటీలో చర్చించకుండా బహిరంగంగా మాట్లాడటం కూడా జంపన్న సస్పెన్షన్‌కు మరో కారణమన్నారు.

శత్రువు ఎదుట మోకరిల్లాడు...
పార్టీలో చేసిన అనేక తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా జంపన్న విలువలు కాలరాసి శత్రువు ఎదుట మోకరిల్లాడంటూ కేంద్ర కమిటీ మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ అలవాట్లకు తలొగ్గి జంపన్న లొంగిపోయినట్లు అభయ్‌ విమర్శించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులకు తగ్గట్లుగానే మావోయిస్టు పార్టీలో మార్పు జరిగిందని, ఈ అంశంపై చర్చించేందుకు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఉందని అభయ్‌ తెలిపారు.

అయితే కేంద్ర కమిటీ సమావేశాలకు రాకుండానే పార్టీలో మార్పులపై చర్చించే అవకాశం లేదంటూ జంపన్న పోలీసుల ఎదుట ఆరోపించడం సమంజసం కాదన్నారు. దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మావోయిస్టు పార్టీలో మార్పు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్‌ మొత్తం కృషి చేస్తున్న సందర్భంలో పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శించడం ఎలాంటి సిద్ధాంతమో జంపన్న ఆలోచించుకోవాలని అభయ్‌ వ్యాఖ్యానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top