
రోహిత్ శర్మతో జైస్వాల్ (ఫైల్ ఫొటో)
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను తిరిగి జట్టులోకి తీసుకునే విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి అభయ్ హదాప్ (Abhay Hadap) స్పష్టం చేశాడు. జైసూ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని.. అయితే, అందుకు ఎంసీఏ ఇంకా స్పందించలేదని తెలిపాడు.
గోవా జట్టుకు మారాలని
కాగా భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫునే కొనసాగాలని ఆశిస్తున్నాడు. గతంలో రంజీ ట్రోఫీ అనంతరం ముంబై నుంచి గోవా జట్టుకు మారాలని అనుకున్న జైస్వాల్... ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోరాడు.
ఇందుకు అంగీకరించిన ఎంసీఏ జైస్వాల్‌కు ఎన్‌ఓసీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న జైస్వాల్ ఈ సీజన్‌లో ముంబై జట్టుకే ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఎంసీఏకు లేఖ రాశాడు.
అందుకే యూ- టర్న్
‘గోవా జట్టుకు మారేందుకు కొన్ని కుటుంబ ప్రణాళికలు మధ్యలో ఉన్నాయి. అందుకే ఆ దిశగా ఆలోచించడం లేదు. నాకు ఇచ్చిన ఎన్‌ఓసీని ఉపసంహరించుకోవాలని ఎంసీఏను కోరుతున్నా.
కాబట్టి ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడేందుకు అనుమతించమని ఎంసీఏను అభ్యర్థిస్తున్నా. నేను ఎన్‌ఓసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ సంఘానికి గానీ సమర్పించలేదు’ అని యశస్వి పేర్కొన్నాడు.
సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం
ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదాప్ స్పందిస్తూ.. ‘‘అవును.. గురువారం జైస్వాల్ ఎంసీఏకు ఇ-మెయిల్ పంపించాడు. తాను ఇప్పుడు ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
అయితే, ఈ విషయంలో ముంబై సెలక్షన్ కమిటీ, క్రికెట్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీదే తుది నిర్ణయం. జైస్వాల్ భవిష్యత్తులో ముంబైకి ఆడతాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని పేర్కొన్నాడు.
అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం
ఇక గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంబా నాయక్ దేశాయి కూడా జైసూ యూటర్న్‌పై తన స్పందన తెలియజేశాడు. ‘‘జైస్వాల్ తన బిజీ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని.. గోవా జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని భావించాడు.
కాబట్టి మా గెస్టు ప్లేయర్ల జాబితాలో ఒకరు తగ్గిపోతారు. ఏదేమైనా ఇరువర్గాల మధ్య ఇందుకు సంబంధించి సమన్వయం, పరస్పర అవగాహన ఉన్నాయి. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
మూడు ఫార్మాట్లలో ఆడుతున్న జైసూ
కాగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల యశస్వి .. సారథ్య బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ముంబై నుంచి గోవాకు మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ముంబై తరఫున 2019లొ అరంగేట్రం చేసి.. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 12 అర్ధ శతకాలు, 13 శతకాల సాయంతో 3712 పరుగులు సాధించాడు. కాగా గత ఏడాది చివర్లో రోహిత్ శర్మతో కలిసి జైసూ.. ముంబై ఓపెనర్‌గా ఆఖరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 19 టెస్టులు ఆడిన యశస్వి జైస్వాల్ 4 సెంచరీలు, రెండు ద్విశతకాల సాయంతో 1798 పరుగులు సాధించాడు. 23 టీ20లలో 723, ఒక వన్డేలో 15 పరుగులు చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి.. మెరుగైన అవకాశాల కోసం ముంబైకి చేరి.. అదే జట్టు తరఫున దేశీ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!