ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘ఆయుష్‌’: లక్ష్మారెడ్డి

Aayush' under the Aarogyasri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్‌ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అలోపతి వైద్య సేవలు మాత్రమే ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నాయి. ఆయుష్‌ (ఆయుర్వేదం, యునానీ, హోమియో, ప్రకృతి) వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ విభాగంలోని 56 రకాల సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఆయుష్‌ విభాగంలోని మొత్తం 56 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చే ప్రతిపాదనపై లక్ష్మారెడ్డి సోమవారం సమీక్షించారు. ఏయే విభాగంలోని ఏయే సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలన్న దానిపై పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవల బకాయిలు, చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) అమలుపైనా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కల్తీలేని మోడల్‌ సిటీలు..
ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆ విభాగం అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లోని ఒక్కో వీధిని ఎంపిక చేసి కల్తీలకు తావులేని వస్తువులను, పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీనికి అవసరమైన ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. స్వైన్‌ ఫ్లూ, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నా.. తగిన వైద్యంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top