నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు | The Aarogyasri services was stopped | Sakshi
Sakshi News home page

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

Dec 2 2018 2:16 PM | Updated on Dec 2 2018 2:16 PM

The Aarogyasri services was stopped - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నల్లగొండ జిల్లా కొండారానికి చెందిన నిరుపేద రమేష్‌(19) శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న క్షతగాత్రుడిని బంధువులు శనివారం ఉదయం ఎల్బీనగర్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆరోగ్యశ్రీ పథకంలో అడ్మిట్‌ చేయాల్సిందిగా కోరగా, సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారు అడిగినంత చెల్లించి ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. మరోఘటనలో ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన చంపాపేటకు చెందిన వినోద్‌(35)ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. ఈ పరిస్థితి రమేష్, వినోద్‌లకు మాత్రమే కాదు.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు అనేకమందికి శనివారం ఎదురైన అనుభవం.  


నిమ్స్‌కు పెరిగిన రోగుల తాకిడి 
ప్రైవేటు ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం గత ఏడాది నుంచి పైసా విదల్చకపోవడంతో ప్రస్తుతం బకాయిలు రూ.1200 కోట్లకు చేరాయి. చికిత్స చేసిన 40 రోజుల్లోనే బిల్లు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఏడాదిగా బకాయిలు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నవంబర్‌ 20 నుంచి ఔట్‌ పేషంట్‌ సర్వీసులు, నవంబర్‌ 30 అర్ధరాత్రి నుంచి ఇన్‌పేషంట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

ఆ మేరకు తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు శనివారం ఉదయం నుంచి ఇన్‌పేషంట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులు, గుండెపోటు బాధితులు, కాలేయ, మూత్ర పిండాల జబ్బులతో ఆస్పత్రులకు వస్తున్న ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కనీస వైద్యం అందలేదు.

మరోదారి లేక కొందరు అడిగినంత చెల్లించి చేరగా, మరికొందరు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు తరలిపోయారు. దీంతో ఆయా ఆస్పత్రులకు శనివారం ఆరోగ్యశ్రీ రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇప్పటికే సాధారణ రోగులతో కిటకిటలాడుతున్న ఆయా ఆస్పత్రుల్లో తాజా కేసులకు కనీసం పడకలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది.

 
70 శాతం చికిత్సలు ప్రైవేటులోనే 
నగరంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలో 240 ఆస్పత్రులు ఉండగా, వీటిలో అపోలో, యశోద, కేర్, కిమ్స్, స్టార్, సన్‌షైన్, కామినేని, మ్యాక్స్‌క్యూర్, కాంటినెంటల్‌ సహా 11 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ పరిధిలో ఉన్నాయి.

మిగిలినవి ప్రైవేట్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ జాబితాలో ఉన్నాయి. నెట్‌వర్క్‌ పరిధిలోని మెజార్టీ ఆస్పత్రులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే. జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులతో పోలిస్తే నగరంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉండడంతో జిల్లాల నుంచి చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సరోజినిదేవి, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రుల్లోనూ ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌లో 70 శాతం చికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, 30 శాతం 
చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement