తెలంగాణలో రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు

Published Fri, Sep 19 2014 1:10 AM

7 Crores investments in Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు ఆరంభమయ్యాయి. పలు కంపెనీలు భారీగా విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. సుమారు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర గురువారం ‘సాక్షి’కి వివరించారు. దీనివల్ల దాదాపు 4 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేపట్టిన జిల్లాల పర్యటన అనంతరం పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం దూరదృష్టిని గమనించిన అనేక పరిశ్రమలు  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ప్రదీప్ పేర్కొన్నారు. 
 
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల వద్ద అమెరికా-ఫ్రాన్స్ దేశాలకు చెందిన కోజెంట్ కంపెనీ గ్లాస్ బాటిళ్ల తయారీ యూనిట్‌ను ప్రస్తుతం రూ. 200 కోట్లతో ఏర్పాటు చేసింది. మరో రూ. 300-400 కోట్లతో దీన్ని త్వరలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. 
 
దేశంలోనే అతి పెద్ద సబ్బుల తయారీ యూనిట్ కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు కానుంది. జిల్లాలోని కొత్తూరు మండలంలో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ టైడ్, ఏరియల్ సబ్బుల తయారీ యూనిటును మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 900 కోట్లతో తమ కంపెనీని ఏర్పాటు చేసింది. విస్తరణలో భాగంగా రెండు మూడేళ్లలోనే సుమారు 3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా 1500 మందికి ఉపాధి లభించనుంది.
 
ఇక కొత్తూరు మండలంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 47 ఎకరాల్లో రూ. 400 కోట్లతో ఏర్పాటు చేయనున్న తొలి యూనిట్‌కు సీఎం గురువారం శంకుస్థాపన చేశారు. వచ్చే 18 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభంకానుంది. డయపర్స్, సబ్బులు, బేబీ ఆయిల్, బేబీ షాంపుతో పాటు మెడికల్ ఉత్పత్తులను కూడా కంపెనీ చేపడుతోంది. అదనంగా 4 వేల కోట్లతో మరో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరిస్తామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement