మూలన పడిన ‘ఫైలు’ దుమ్ముదులుపుతున్న పురపాలక శాఖ
అక్రమ నిర్మాణాల నియంత్రణలోట్రిబ్యునల్ కీలకం.. 2016లోనే దీని ఏర్పాటుకు నియమావళి రూపకల్పన
వివిధ కారణాలతో ముందుకుసాగని వైనం.. తాజాగా పరిశీలనలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు పట్టణీకరణ వేగవంతమవుతుంటే మరో వైపు అంతే వేగంతో అక్రమ నిర్మాణాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిర్దిష్ట యంత్రాంగమేదీ లేకపోవడంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. మహానగరంలో ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాం. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల్లో సుమారు 80 శాతం మేర అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం.
కాగా అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది కొరత, కోర్టు స్టే ఆర్డర్ల మూలంగా కూల్చివేతలు చేపట్టలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించినా లేదా రద్దు చేసినా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మూలన పడిన ‘మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్’(ఎంబీటీ) ఏర్పాటు అంశాన్ని పురపాలక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
2016లోనే తెరమీదకు ట్రిబ్యునల్
2016లో ఎంబీటీ అంశం తెరమీదకు రాగా ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేశారు. 2017లోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి నియమావళిని రూపొందించారు. ఈ నియమావళి ప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉండాలి. న్యాయ, సాంకేతిక అంశాలపై అవగాహన కలిగిన వారిని ట్రిబ్యునల్‌లో నియమించాలని ప్రతిపాదించారు. కేసుల సంఖ్యను బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌లను కూడా ఏర్పాటు చేయవచ్చు.
ప్రతీ బెంచ్‌లో కనీసం ఇద్దరు సభ్యులు (ఒకరు న్యాయ, మరొకరు సాంకేతిక అనుభవం) ఉండాలనే నిబంధన విధించారు. చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి జిల్లా జడ్జి లేదా మాజీ జిల్లా జడ్జి స్థాయి అధికారి అయి ఉండాలి. టెక్నికల్ సభ్యుడు తెలంగాణ టౌన్ ప్లానింగ్ సర్వీస్‌లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అనే నిబంధనలు విధించారు.
ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ పదవికి అర్హులైన ఇద్దరు జిల్లా జడ్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. పలు విభాగాలు కూడా సభ్యుల పేర్లను పురపాలక శాఖకు సూచించాయి. ప్రతిపాదించిన సభ్యుల్లో కొందరిపై ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వేర్వేరు కారణాలతో ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు.
2022లో హైకోర్టు ఆదేశాలు
మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని 2022 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని 2023లోనూ కోర్టు మరోసారి గుర్తుచేస్తూ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంది.
మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పారదర్శకత పెంచడం, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా చేపడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట పడినా, ఇతర అక్రమ నిర్మాణాల నియంత్రణకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ లాంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమనే డిమాండ్ బలపడుతోంది.


