
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వివిధ ట్రేడ్ యూనియన్‌ల ర్యాలీ
సాక్షి, మహబూబ్‌నగర్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం రెండో రోజు కొనసాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు రెండో రోజు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పోలీసుల సహకారంతో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో బస్సులు నడిపించారు. ఉదయం నుంచి బస్సులు బస్టాండ్ల నుంచి కదిలాయి. సాయంత్రం 5 గంటల వరకు రీజియన్ పరిధిలో 835 బస్సులకు గాను 507 బస్సులు నడిచాయి. మహబూబ్‌నగర్ డిపోలో 131 బస్సులకు 86, నారాయణపేటలో 112 బస్సులకు 56 బస్సులు నడిచాయి.
డిపోలోని మొత్తం బస్సులు | 131 |
రెండోరోజు తిరిగినవి | 86 |
డిపోకే పరిమితమైనవి | 45 |
ప్రైవేట్ వాహనాలకు గిరాకీ...
సమ్మెతో ప్రైవేట్ వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌ల ఎదుట ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లారు. కాగా సమ్మెతో ప్రైవేట్ వాహనాల్లో రోజువారీ కంటే అధికంగా డబులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, జడ్చర్ల, భూత్పూర్, నారాయణపేట, కల్వకుర్తి రూట్లలో ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా నడిచాయి.
తగ్గిన ఆర్టీసీ ఆదాయం
సాధారణ రోజుల్లో రీజియన్ పరిధిలో రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి 10లక్షల వరకు ఆదాయం సమకూరేది. సమ్మె వల్ల ఆదాయం తగ్గుతోంది. రెండో రోజు రీజియన్‌లో దాదాపు 10 నుంచి 15 శాతం ఆదాయం మాత్రమే వస్తోంది. దసరా పండుగ దినాల్లో ఆర్టీసీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సమ్మె నేపథ్యంలో ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
ఎమ్మార్పీఎస్ మద్దతు
మెట్టుగడ్డ: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి. శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు యం.పాపయ్య ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అధికార ప్రతినిధి యం. శ్రీనివాస్ తెలిపారు. పి. జంబులయ్య, కె. రమేష్, కె. నరేందర్, వెంకటయ్య, రాజు పాల్గొన్నారు.
హైదరాబాద్ రూట్లో అధిక బస్సులు..
మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ రూట్లో అధిక బస్సులు నడిపించారు. దసరా పండుగ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను ఏర్పాటు చేశారు. తాండూర్, పరిగి, నారాయణపేట, కోయిలకొండ రూట్లో కూడా బస్సులు నడిచాయి. బస్సులకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినా తాత్కాలిక కండక్టర్లు కొన్ని రూట్లలో అదనంగా వసూలు చేశారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు కూడా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చాయి. ఉదయం ప్రయాణికుల తాకిడి అంతగా లేకున్నా మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. దసరా పండుగ దృష్టా నేటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్టాండ్, డిపోల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్‌ఎం కార్యాలయం ఎదుట నిరసన
జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసనలకు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాటం చేశారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనితతోపాటు ఇతర నేతలు, ప్రజాసంఘాల నాయకులు ప్రసంగించారు. అంతకుముందు ఆ యా ట్రేడ్ యూనియన్‌ల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి కార్మికులకు సం ఘీభావం ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, కార్మికులు బ తుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ముఖాలకు న ల్ల రిబ్బన్‌లు కట్టుకొని నిరసన పాటలు పాడారు. సమావేశంలో కిల్లెగోపాల్ (సీపీఎం), కురుమూర్తి (సీఐటీయూ), రాంమోహన్ (ఏఐటీయూసీ). వెంకటేశ్ (ఇఫ్టూ), రాములుయాదవ్ (ఐఎన్‌టీయూసీ), కృష్ణయ్య (బీఎస్‌ఎన్‌ఎల్), సురేష్ (ఏఐయూఎఫ్), కేవీపీఎస్ (కురుమయ్య), గాలెన్న (బీసీడబ్ల్యూ), సాయిరెడ్డి (ఎల్‌ఐసీ), పద్మ( ఏఐడీడబ్లూఏ)తోపాటు ఆర్టీసీ జేఏసీ నేతలు జీఎల్‌గౌడ్, వీరాంజనేయులు, డీఎస్‌చారి, కొండన్న, కె.రవీందర్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, విజయ్‌బాబు, కోడూర్ శ్రీను, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.