నెలాఖరులోగా 4జీ సేవలు 

4G services by the end of the month - Sakshi

40 పట్టణాల్లో 409 టవర్స్‌  

2జీ, 3జీ సైట్స్‌ల్లో కొత్త పరికరాలు  

మెట్రో రైలు కారిడార్‌లో 64 టవర్స్‌  

బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ టెలికం సర్కిల్‌ సీజీఎం సుందరం వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నా యి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ముఖ్య పట్టణాల్లో కలిపి 40 చోట్ల 409 4జీ టవర్స్‌ ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) సుందరం వెల్లడించారు. స్పెక్ట్రం అనుమతి లభించిన వెంటనే 4జీ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ దూర్‌ సంచార్‌ భవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సుమారు రూ.123 కోట్ల వ్యయంతో 2జీ, 3జీ నెట్‌వర్క్‌గల ప్రాంతాల్లో సేవలు అప్‌గ్రేడ్‌చేసి కొత్త పరికరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మెట్రో రైలు కారిడార్‌లో 2జీ,3జీ సేవలను అందుబాటులో తెచ్చేందుకు 64 టవర్స్‌ ఏర్పాటు లక్ష్యానికి గాను ఇప్పటికే 24 స్టేషన్లలో సేవలు అందిస్తున్నామన్నారు. మిగిలిన స్టేషన్లలో సైతం సేవలు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వైఫై 910 హాట్‌స్పాట్స్‌ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 487 స్పాట్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన 423 ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన 4,09,855 ల్యాండ్‌లైన్, 1,12,978 బ్రాండ్‌ బాండ్, 27,723 ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్లు వర్కింగ్‌లో ఉన్నట్లు వివరించారు.  

రూ.1,699 వార్షిక ప్లాన్‌ 
కొత్త సంవత్సరం ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్తప్లాన్‌లను ప్రవేశపెట్టినట్లు సీజీ ఎం వివరించారు. వార్షిక–1,699, వార్షిక ప్లస్‌– 2009, పది శాతం అదనపు టాక్‌ టైమ్, ప్రమో షనల్‌ ఎస్‌టీవీ, అదనపు డేటా ఆఫర్స్‌ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బాండ్‌పై కూడా అదనపు వాయిస్‌ కాల్స్, ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్లపై అదనపు జీబీ వర్తింపు ఆఫర్స్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. సమావేశంలో టెలికం పీజీఎంలు రాంచంద్రం, ఎస్‌.వెంకటేశ్, నరేందర్, సీఎస్‌ఎన్‌ మూర్తి  పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top