అనగనగా.. ఒక విశాఖ మెట్రో.. | Visakhapatnam Metro Rail Project Tenders Ends Of Tomorrow, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

అనగనగా.. ఒక విశాఖ మెట్రో..

Sep 11 2025 9:18 AM | Updated on Sep 11 2025 10:34 AM

Visakhapatnam Metro Rail Project Tenders Ends Of Tomorrow

రేపటితో ముగియనున్న వైజాగ్‌ మెట్రో టెండర్ల గడువు 

ఒక్కరూ ఆసక్తి చూపించకపోవడంతో సర్కార్‌కి షాక్‌ 

పలు సంస్థలతో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మంతనాలు 

వైట్‌ ఎలిఫెంట్‌ ప్రాజెక్ట్‌ అంటూ పెదవి విరిచిన సంస్థల ప్రతినిధులు  

ప్రాజెక్ట్‌ టెండర్లను ప్యాకేజీలుగా విభజిస్తామంటూ ప్రభుత్వం హామీ 

టెండర్ల గడువు అక్టోబర్‌ 7వ తేదీ వరకు పొడిగింపు

గత ప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది.  ఇంతలో జట్టు కట్టి జనాన్ని మాటలతో మభ్యపెట్టిన మాంత్రిక ప్రభుత్వం వచ్చింది. హాఠ్‌ ... మెట్రో మీరు కాదు మేమే కడతామంటూ పాత డీపీఆర్‌ని రద్దు చేసేసింది. అమరావతి మాదిరిగా డిజైన్లుండాలంటూ కేంద్రానికి కొత్తగా డీపీఆర్‌ పంపించింది. అదేమో.. అక్కడ ఆమోదించలేదాయే.. కూటమి సామ్రాజ్య నేతలు బతిమాలుతున్నా వాళ్లు పట్టించుకోలేదు. అసలే ‘సిక్స్‌’ కొట్టబోయి.. సూపర్‌ ఫ్లాప్‌ అయిన బాబు జట్టు.. మరోసారి జనాలకు మాయమాటలు చెప్పేందుకు సిద్ధమైంది. ఇదిగో మెట్రో అంటే.. అదిగో టెండర్లు అంటూ ఊదరగొట్టారు. ఆహా.. వైజాగ్‌కి మెట్రో వచ్చేసిందంటూ.. సోషల్‌ మీడియా సామంతరాజులంతా గ్రాఫిక్స్‌ జిమ్మికులతో అదరగొట్టేశారు. తీరా చూస్తే.. టెండర్లు గడువు ముగుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. బాబ్బాబూ.. రండి.. వచ్చి టెండర్‌ పెట్టండి అని బతిమాలుతున్నా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని.. ఈ ‘భారీ’ ప్రాజెక్టును భాగాలుగా చేసి.. వాటాల పేరుతో టెండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్‌ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది.  

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత.. చెప్పేది కొండంత. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా.. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు ఆమోదం చెప్పకుండానే గ్రాఫిక్‌ జిమ్మిక్కులు చూపించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లు(జీఎస్‌టీ అదనం)తో టెండర్లను ఆహ్వానించింది. 

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్‌–1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్‌సీ టెండర్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ పనులను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్‌ షెడ్యూలులో చెప్పింది. టెండర్‌ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్‌ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నెల 12వ తేదీతో టెండరు గడువు ముగియనుంది. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో సర్కార్‌కి షాక్‌ తగిలినట్లయింది.

సమయమిస్తాం.. రండి.. ప్లీజ్‌.! 
టెండర్లు వేసేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం.. కాంట్రాక్టు నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ బిడ్డింగ్‌ సమావేశంలో కారణాలు చెప్పాలంటూ అధికారులు కోరారు. భారీ మొత్తంలో ప్రాజెక్టు టెండరు దక్కించుకున్నా.. లాభార్జన సాధ్యం కాదనీ.. పైగా టెండర్‌లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని షరతు విధించడంపై విమర్శలు వెల్లువెత్తినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక టెండరు గడువు పొడిగిస్తామనీ సలహాలు, సూచనలు చెప్పాలని ప్రభుత్వం అభ్యర్థించంది.

 ప్యాకేజీలుగా విభజిస్తే ఆలోచిస్తామని కొన్ని సంస్థలు బదులిచ్చాయనీ.. దీంతో కూటమి ప్రభుత్వం పరువు పోగొట్టుకోకుండా ఉండేందుకు టెండరు ప్రక్రియని సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. జాయింట్‌ వెంచర్‌ మోడల్‌లో పనులు చేసేందుకు అవకాశం కలిపంచాలి కొన్ని సంస్థలు కోరాయి. దానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించి.. టెండర్లు అక్టోబర్‌ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైల్‌ పాలక మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలో నిర్ణయం తీసుకోనున్నారు.  

ప్రతి ఫేజ్‌లోనూ టెండర్ల విభజన..! 
విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కి.మీ మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్‌ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్‌ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్‌ప్లాంట్‌ మధ్య కారిడార్‌లో 34.40 కి.మీ మేర డబుల్‌ డెక్కర్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కి.మీ మేర రెండో కారిడార్‌ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ మధ్య మరొక కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి ఫేజ్‌ పనుల టెండర్లను కూడా ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏమీ లేకుండానే ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన కూటమి ప్రభుత్వానికి మెట్రో షాక్‌ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement