తెలంగాణలో మరో 27 కేసులు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో 27 కేసులు

Published Fri, Apr 24 2020 1:20 AM

27 New Corona Cases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురువారం మరో 27 మందికి కరోనా సోకింది. ఒకరు మృతి చెందారు. మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకు 970కి చేరుకోగా, మరణాలు 25కు చేరుకున్నాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 13, గద్వాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కోఠిలోని కరోనా కమాండ్‌ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం 58 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 252కి చేరిందని వివరించారు. మరో 693 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని చెప్పారు. దేశంలో లాక్‌డౌన్‌కు పలు సడలింపులు ఇవ్వాలని భావిస్తున్నా తెలంగాణలో మాత్రం పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామన్నారు.

ర్యాపిడ్‌ టెస్ట్‌లను మొదటి నుంచీ మనం చేయట్లేదని, ఇప్పుడు కేంద్రం కూడా వద్దని చెప్పిందన్నారు. ప్రస్తుతానికి వాటి అవసరం లేదని, రావొద్దని కూడా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్లాస్మా థెరపీకి కూడా త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. మరణాల రేటును తగ్గించేదుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 3.18 శాతం ఉంటే తెలంగాణలో 2.6 శాతం ఉందన్నారు. రికవరీ రేటు దేశంలో 19.9 శాతం ఉంటే, తెలంగాణలో 22 శాతం ఉందన్నారు. మన దగ్గర ఉన్న 9 ల్యాబొరేటరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. రోజూ 1,540 కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

37,603 ప్రసవాలు..
4 లక్షల పీపీఈ కిట్లు, నాలుగున్నర లక్షల ఎన్‌–95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హెల్త్‌ వర్కర్స్‌ అందరికీ 2 డోసుల హెచ్‌సీక్యూ మాత్రలు అందించామని చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 37,603 ప్రసవాలు చేశామని మంత్రి వివరించారు. రక్తం లేదని పిలుపునిస్తే అవసరానికి మించి అందిందన్నారు. గచ్చిబౌలీ ఆస్పత్రి సిద్ధంగా ఉందని, గాంధీ ఆస్పత్రి నిండిన తర్వాత వైరస్‌ సోకిన వారిని అక్కడకు పంపిస్తామన్నారు.

ప్రైవేటు అంబులెన్స్‌లు వాడుకుంటాం..
గర్భిణులు, కేన్సర్, కిడ్నీ, డయాలసిస్‌ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల తెలిపారు. 108 అంబులెన్సులను చాలా వరకు కరోనా పేషెంట్లకు వాడుతుండటం వల్ల, మిగతా వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రైవేటు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు. నాలుగైదు రోజుల్లో కరోనా కేసులు మరింత తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో తీసుకున్నట్లే సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

గంట గంటకు సీఎం సమీక్ష..
గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించి అక్కడి సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందించారన్నారు. అనంతరం సీఎం పలు సూచనలు సలహాలు చేశారని ఈటల రాజేందర్‌ తెలిపారు. వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. వరి, మొక్కజొన్నల కొనుగోళ్లపై కూడా సీఎం గంట గంటకు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను కరోనా ఆస్పత్రుల పనితీరుపై చర్చించానని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ వ్యక్తులందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్, చికిత్స, టెస్టులు, డిశ్చార్జ్‌లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గాంధీని మొత్తం 6 యూనిట్లుగా విభజించాలని, ప్రతి యూనిట్‌కి ఒక ప్రొఫెసర్‌ను ఇంచార్జ్‌గా నియమించాలని సూచించినట్లు వివరించారు. అన్ని యూనిట్లలో సమానంగా రోగులు ఉండేలా చూడాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చామన్నారు. మరణాల రేటు తగ్గించడానికి ఏం చేయాలన్న అంశంపై చర్చించామన్నారు. చదవండి: సగానికిపైగా సేఫ్‌! 

Advertisement
Advertisement