లిక్కర్‌ అమ్మకాలకు డబుల్‌ కిక్కు 

25 percent growth to excise department in this Dussehra festival - Sakshi

     ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత 15 శాతం పెరుగుదల 

     ఈ దసరాకు 25 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా 

సాక్షి, హైదరాబాద్‌: లిక్కర్‌ అమ్మకాలకు ఎన్నికల వాతావరణం కిక్కు ఎక్కిస్తోంది. మరోవైపు దసరా సంబురాలు సమీపిస్తుండటంతో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గ్రేటర్‌ పరిధిలో నిత్యం రూ.10 కోట్ల మేర వివిధ రకాల బ్రాండ్ల మద్యం, బీర్లు అమ్ముడవుతుండగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరవాత అమ్మకాల్లో 15 శాతం పెరుగుదల నమోదైనట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహానగరం పరిధిలో సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లు వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల సమావేశాలు, చీర్స్‌ పార్టీలతో హోరెత్తుతున్నాయి. గతేడాది దసరా కంటే ఈసారి అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదవుతుందని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రేటర్‌లో రోజుకు సుమారు పది లక్షల లీటర్ల బీరు, ఐదు లక్షల లీటర్ల మేర దేశీ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని నిషాచరులు సేవిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ప్రతి శుక్ర, శని వారాల్లో మద్యం వాడకం అధికంగా ఉందని ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా 16–35 ఏళ్ల మధ్యనున్నవారు బీరు, 35–55 మధ్య వయస్కులు విస్కీ సేవిస్తుండటం గమనార్హం.  

వీకెండ్‌లో జోష్‌... 
ఐటీ, బీపీవో, కేపీవో, రియల్టీ, సేవారంగాల్లో పనిచేస్తున్నవారిలో అత్యధికులు శుక్ర, శనివారాల్లో లిక్కర్‌ కిక్కుతో పసందు చేసేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తాజా మద్యం అమ్మకాల తీరుతో తెలుస్తోంది. గ్రేటర్‌లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుండగా, అవి వీకెండ్‌లో రూ.20 కోట్లకు పైమాటే ఉంటున్నాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.  

బడా లిక్కర్‌ మాల్‌ క్యాకమాల్‌... 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ బడాలిక్కర్‌ మాల్‌ మందుబాబులు, గ్రేటర్‌ సిటీజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ లిక్కర్‌మాల్‌ ఆసియాలోనే అత్యంత పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. దీనిలో సుమారు 1,100 రకాల దేశీ, విదేశీ బీరు, విస్కీ, బ్రాందీ, వైన్‌ రకాలు లభిస్తున్నాయి. రూ.300 ధర పలికే బీరు మొదలు రూ.5.23 లక్షల విలువ చేసే ఖరీదైన విస్కీ వరకు ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలవుతున్నాయి. ఇందులో సింహభాగం విదేశీ సరుకుదే. ఏ విదేశీ మద్యాన్ని ఎలా ఆస్వాదించాలి.. ఏ మద్యం సేవిస్తే, ఎలాంటి స్టఫ్‌ తీసుకోవాలన్న అంశంపై కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అవగాహన కల్పించేందుకు సైతం ఈ మాల్‌లో ఏర్పాట్లు చేయడం విశేషం.  

క్షణాల్లో బీ(రు) రెడీ... 
బీర్బలుల దాహార్తిని తీర్చేందుకు క్షణాల్లో బీరును సిద్ధం చేసి చిల్డ్‌గా సర్వ్‌ చేసేందుకు గ్రేటర్‌ పరిధిలో ఏడు మినీ బ్రూవరీలు సైతం అందుబాటులోకి రావడం విశేషం. వీటికి ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగినట్లు నిర్వాహకులు ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఓ బ్రూవరీని నిత్యం వెయ్యిమందికిపైగానే సందర్శిస్తుండగా అది వీకెండ్‌లో 2500–3000 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top