జనాభా రికార్డులో లేని గ్రామాలు

24 Villages Go Missing In Mancherial District - Sakshi

జిల్లావ్యాప్తంగా 24 ఊళ్లు గయాబ్‌

జిల్లాల విభజన అనంతరం పరిణామాలు

2021 జనాభా లెక్కల సేకరణ ఆటంకం

రెవెన్యూ రికార్డుల్లోనే ఊళ్లకు పేర్లు

మరోసారి సవరించి పంపించిన అధికారులు

సాక్షి, మంచిర్యాల: జిల్లాలో.. జిల్లా పునర్విభజనకు ముందున్న 24 గ్రామాలు ప్రస్తుతం జనాభా రికార్డుల్లో కనిపించడం లేదు. 2021 జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. జిల్లా జాబితాను పరిశీలించగా.. 8 మండలాల్లోని 24 గ్రామాల పేర్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. దీనిపై జిల్లా అధికారులను నివేదిక కోరారు. జిల్లా ప్రణాళిక, గణాంక, రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డుల పరంగా గ్రామాలను మరోసారి నో టిఫై చేసి రాష్ట్ర సెన్సెన్‌ కార్యాలయానికి పంపిం చారు. జిల్లాల విభజన అనంతరం జనాభా రికార్డుల్లో  కానరాకుండాపోయింది.

11 అక్టోబర్‌ 2016న జీవోనంబర్‌ 222 రెవెన్యూ ప్రకారం ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజన, మండలాలు, గ్రామాలు, జనాభా, సరిహద్దులు, తదితర వివరాలు రెవెన్యూ అధికారులు జిల్లాల వారిగా పొందపరిచారు. ఆ సమయంలో 2011 జనాభా లెక్కలో మంచిర్యాల జిల్లాలో ఉన్న 24 గ్రామాలు పేర్లు రికార్డుల్లో నమోదు కాకుండపోయాయి. దండేపల్లిలోని రోళ్లపహేడ్, చెన్నూర్‌ మండలం ఆదిలవార్‌పేట్, గుడ్డిరాంపూర్, కోనంపేట్, ఆముదాలపల్లి, కోటపల్లి మండలం ఆయపల్లి, చింతకుంట, ఆడకపల్లి, మందమర్రి మండలం లిమూర్, కాసిపేట మండలం దేవపూర్, నెన్నెల మండలంలోని పుప్పాలవనిపేట, సీతనగర్, కుంమ్మపల్లి, బధ్రపూర్, మంకపూర్,బోదపూర్, భగీరథ్‌పేట, సింగపూర్, తాండూర్‌ మండలంలో వెంకాయపల్లి, అనకపెల్లి, మదనపూర్, రాంపూర్, భీమిని మండలంలోని రాం పూర్, సాలిగాం గ్రామాలు పేర్లు గల్లంతయ్యా యి.

విచిత్రమేమిటంటే.. ఇందులోని 20 గ్రామాల వరకు పేర్లు మాత్రమే ఉండగా.. అక్కడ జనంగానీ.. కనీసం ఇళ్లుగానీ లేవు. వ్యవసాయ భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామశివారుతో పేర్లు మాత్రం రెవెన్యూ రికార్డులో ఉంటున్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొ ంటున్నారు. ఏళ్ల క్రితం ఇక్కడ జనం ఉండే.. అంటున్నా.. ఇక్కడి జనం ఎక్కడికి వెళ్లారు..? మరి ఊరుపేరు మాత్రం ఎలా మిగిలింది..? 2011 జనాభా లెక్కలో ఆ గ్రామాల పేర్లు ఎలా వచ్చాయి..? అనేవి  జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. 

ప్రస్తుతం జనాభా ఉన్న గ్రామాలు..
జిల్లా విభజన సమయంలో బెల్లంపలి రెవెన్యూ డివిజన్‌తోపాటు, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, దండేపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, వేమనపల్లి, భీమిని, మండలాలతోపాటు కొత్తగా హాజీపూర్, నస్పూర్, భీమారం, కన్నెపల్లి, మొత్తం 18 మండలాలు, 385 గ్రామాలతో జిల్లా ఆవిర్భవించింది. ఈ సమయంలో జిల్లా నుంచి 24 గ్రామాల పేర్లు గల్లంతు కాగా ఇందులో 20 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు సమీప గ్రామాలలో స్థిరనివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఇళ్లు, జనాభా లేకపోయినా రెవెన్యూ రికార్డులో గ్రామ శివార్లు కొనసాగుతున్నాయి. గతంలో అక్కడ ఆ గ్రామాలు ఉన్నట్లు ఇప్పటికీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామాల్లోని గ్రామదేవతలు కనిపిస్తున్నాయి. మిగితా 4 గ్రామాలలో ప్రజలు ఇప్పటికే కొనసాగిస్తున్నారు.

కాసిపేట మండలంలోని దేవపూర్‌లో అతిపెద్ద సిమెంట్‌ కర్మాగారం ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ గ్రామం తెలియని వారు ఉండరు. సిమెంట్‌ కంపెనీపై ఆధారపడి కార్మికులు, ఇతరవర్గాలవారు, వ్యవసాయ కుటుంబాలు వేల సంఖ్యలో జీవిస్తున్నాయి. దీంతోపాటు గతంలో మందమర్రి మండలం ప్రస్తుతం ఇటీవల మున్సిపాలిటీగా ఆవిర్భవించిన క్యాతనపల్లి, కన్నెపల్లి మండలం సాలిగాం, భీమిని మండలంలోని రాంపూర్‌లో వేల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి. తమ గ్రామం పేరు లేకుండా పోవడమేంటని ఇక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. సవరించి పంపించాం..

జిల్లా సరిహద్దు, మండలాలలు, గ్రామాలు, జనాభా వివరాలు పంపించాం. ఆ సమయంలో కొన్ని గ్రామాల పేర్లు గల్లంతవడంతో పాటు తప్పుగా వచ్చాయి. గల్లంతయిన గ్రామాల పేర్లతో పాటు తప్పులను తిరిగి సవరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించాం. సెన్సెస్‌ కార్యాలయం వారు కొత్త జాబితాలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామశివారుతో పేర్లు మాత్రమే ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top