బోగస్ కార్డులు రెండు లక్షలు..!

బోగస్ కార్డులు రెండు లక్షలు..! - Sakshi


సెప్టెంబర్ 15 డెడ్‌లైన్

- ఇప్పటికి ఏరేసిన కార్డులు 65,115

- 39,350 కార్డులకు సరుకులు నిలిపివేత

- దసరాకు కొత్త కార్డులు!

ముకరంపుర : బోగస్ తెల్లరేషన్‌కార్డులకు కాలం చెల్లనుంది. కార్డుల ఏరివేతకు ఈ నెల 15ను అధికారులు డెడ్‌లైన్ విధించారు. ఇప్పటికే జిల్లాలో 65,115 కార్డులు బోగస్‌గా గుర్తించి రద్దు చేశారు. ఆధారాలు సమర్పించని, 39,350 రచ్చబండ కార్డుదారులను సరుకులు నిలిపివేశారు. మిగతా బోగస్‌కార్డులను ఈ పది రోజుల్లో ఏరివేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశించారు.

 

జిల్లాలో 9,76,022 కుటుంబాలుండగా.. 10,86,427 కార్డులున్నాయి. కుటుంబాలకంటే 1.11 లక్షల కార్డులు ఎక్కువగా ఉన్నాయి. రచ్చబండ-3లోనూ పలువురికి కార్డులిచ్చారు. అధికారుల సూచనతో కొందరు డీలర్లు, బోగస్ లబ్ధిదారులు తమవద్ద ఉన్న కార్డులు స్వచ్ఛందంగా అప్పగించారు. బోగస్‌ల గుర్తింపుపై అధికారులూ దూకుడుగానే వ్యవహరిస్తూ ఇప్పటివరకు 65,115 బోగస్ కార్డులను రద్దు చేశారు.



రచ్చబండ-3లో 86,350 మందికి తెల్లకార్డులిచ్చిన ప్రభుత్వం అందులోనే చాలావరకు బోగస్‌వి ఉన్నాయని గుర్తించింది. పూర్తి సమచారమివ్వాలని కార్డుదారులను ఆదేశించింది. ఫొటోలు, ఆధార్‌నంబర్లు సమర్పించని వారు బోగస్‌కార్డుదారులేనని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వివరాలను సమర్పించని 39,350 మంది రచ్చబండ కార్డుదారులకు ప్రభుత్వం ఈనెల కోటా సరుకులు నిలిపివేసింది. ఈ లెక్కన ఇప్పటివరకు మొత్తం 1,04,465 కార్డులు బోగస్‌విగా తేలాయి. గడువు ముగిసేలోపు మరో లక్ష వరకు బోగస్‌కార్డులు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

దసరాకు కొత్తకార్డులు

లబ్ధిదారులందరికీ తెలంగాణ ప్రభుత్వ ముద్రతో దసరా, దీపావళి పండుగల వరకు కొత్తరేషన్‌కార్డులు అందించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలిస్తోంది. 15లోపు బోగస్‌కార్డుల ఏరివేత పూర్తిచేసి అనంతరం గ్రామసభలు నిర్వహించి, కొత్తగా దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించి అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.

 

15లోగా బోగస్‌కార్డులు తొలగించాలి

ఈ నెల 15లోగా బోగస్ రేషన్‌కార్డులను గుర్తించి తొలగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షలకు పైగా బోగస్ రేషన్‌కార్డులు తొలగించినట్లు తెలిపారు. రచ్చబండ-3 లో ఇచ్చిన కార్డుల్లో ఆధార్ అనుసంధానం చేయని వాటిని పరిశీలించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top