మరో 18 మందికి కరోనా 

18 New Corona Positive Cases Recorded In Telangana - Sakshi

రాష్ట్రంలో 471కి చేరిన పాజిటివ్‌ కేసులు 

తాజాగా ఒకరి మృతి.. 12కి చేరిన మరణాలు 

ఎక్కువ కేసులు మర్కజ్‌తో సంబంధం ఉన్నవే 

నిజామాబాద్, హైదరాబాద్‌లో పెరిగిన కేసులు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 471కి చేరుకుంది. నాలుగైదు రోజులుగా అత్యధికంగా కేసులు నమోదవుతుండగా, గురువారం 18 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నాయి. నాలుగైదు రోజుల్లో పాజిటివ్‌ కేసులు ఏక సంఖ్యకు పడిపోతుందని భావిస్తున్నారు. గురువారం గద్వాలకు చెందిన ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు రాత్రి 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. ఇప్పుడు నమోదైన కేసుల్లో అత్యధికం మర్కజ్‌తో సంబంధం ఉన్నవే కావడం గమనార్హం. కాగా, గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 8 కేసులు, హైదరాబాద్‌లో 6 కేసులు ఉన్నాయి. 

130 హాట్‌స్పాట్లు.. 
రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో హాట్‌స్పాట్లు (క్లస్టర్లు) 130కి పెరిగాయి. ఆయా హాట్‌స్పాట్‌ ఏరియాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంటైన్మెంట్‌ ఫ్లాన్‌ అమలు చేస్తోంది. ఆ ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో 3,116 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వారు 2.56 లక్షల ఇళ్లకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇంకా 32,448 ఇళ్లకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉందని డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. వారికెవరికైనా జలుబు, జ్వరం, దగ్గు ఉంటే వెంటనే క్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నారు. తీవ్రమైతే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అయితే ఏ జిల్లాలో ఎన్నెన్ని హాట్‌స్పాట్లు ఉన్నాయో వైద్య ఆరోగ్య శాఖ వద్ద లెక్కలేకపోవడం గమనార్హం. అసలు జిల్లాల నుంచి హాట్‌స్పాట్ల వివరాలను కూడా తెప్పించుకోవడంలో వైద్యాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top