మర్కజ్‌ @1,030 | 1030 People From Telangana To Have Attended Nizamuddin Markaz In Delhi | Sakshi
Sakshi News home page

మర్కజ్‌ @1,030

Apr 1 2020 12:51 AM | Updated on Apr 1 2020 11:29 AM

1030 People From Telangana To Have Attended Nizamuddin Markaz In Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు 1,030 మంది వెళ్లొచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు నిర్ధారించాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వారిలో 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. వీరిలో  ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో సంభవించిన మరణాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారివే కావడం ఆందోళన కలిగి స్తోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు.. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, ప్రార్థనల్లో పాల్గొనడంతో వారెందరితో కలిసి తిరిగారన్నది అంతుబట్టడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖలో కరోనా కీలక కమిటీలోని ఓ ఉన్నతాధికారి అంచనా ప్రకారం.. ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఒక్కొక్కరు పదిమందినైనా కలిసి ఉంటారు. అలా కనీసం 10 వేల మందితో వారు కాంటాక్ట్‌ అయి ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. కొందరైతే రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రార్థనలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఇంకా ఎక్కువ మందికి అంటుకుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సెక్రటేరియట్‌లో కరోనా కలకలం
ఢిల్లీ వెళ్లిన వారిలో సెక్రటేరియట్‌లో పనిచేసే పశుసంవర్థకశాఖ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆయన సం బంధితశాఖ ఉన్నతాధికారులను కలవడం, తోటి ఉద్యోగులతో కలసిమెలసి తిరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి నమూనాలను పరీక్షల కోసం పంపారు. అక్కడే ఐసోలేషన్‌లో ఉంచారు. పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అతను సెక్రటేరియట్‌లో ఎంతమందిని కలి శారనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనితో మరింత సన్నిహితంగా ఉన్నవారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని, లక్షణాలేమైనా ఉంటే సంప్రదించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మంత్రులు, వారి పేషీ అధికారులుంటారు. పైగా ప్రస్తుత సచివాలయం ఇరుకుగా ఉండటం, గాలీ వెలుతురు తక్కువగా ఉండటంతో వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. దీంతో సచివాలయ ఉద్యోగులు, అధికారులు షాక్‌కు గురయ్యారు.

అత్యధికులు హైదరాబాద్‌ వారే..
ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ మసీదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు అక్కడ జరిగిన ప్రార్థనలకు వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అక్కడికి తెలంగాణకు చెందినవారు 1,030 మంది వెళ్లగా, వారిలో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధికి చెందిన వారు 603 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిజామాబాద్‌ (80), నల్లగొండ (45), వరంగల్‌ అర్బన్‌ (38), ఆదిలాబాద్‌ (30), ఖమ్మం (27), నిర్మల్‌ (25), సంగారెడ్డి (22) జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల నుంచీ పలువురు ప్రార్థనలకు వెళ్లినట్టు ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొన్నారు. అక్కడి నుంచి వచ్చిన వారిలో ఆరుగురు చనిపోవడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది

జల్లెడపడుతున్న నిఘా బృందాలు
ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని పట్టుకోవడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇందులో 3 సమస్యలున్నాయి. ఢిల్లీ వెళ్లిన వారందరినీ గుర్తించి ఐసోలేషన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించడం, వారితో కాంటాక్ట్‌ అయిన 10వేల మందిని గుర్తించడం, వారిలోనూ లక్షణాలున్న వారిని గుర్తించి పట్టుకోవడం. ఇంకా వీరి ద్వారా ఇంకెంతమంది కాంటాక్ట్‌ అయ్యారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఇప్పటికే సర్వైలెన్స్‌ టీమ్‌ల ద్వారా ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 70 శాతం మందిని గుర్తించి పట్టుకున్నారని అధికారులు చెబుతున్నారు. మరో 30 శాతం మందిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇక వారెక్కడెక్కడకు వెళ్లారు? వారితో కాంటాక్ట్‌ అయిన 10 వేల మందిని గుర్తించడం కీలకంగా మారింది. హైదరాబాద్‌లో ఇప్పటికే 200 బృందాలు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఇదే పనిలో ఉన్నారు.

మార్చి 18 నుంచే రంగంలోకి..
రాష్ట్రానికి వచ్చిన ఇండోనేసియా బృందానికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు మార్చి 18న గుర్తించారు. అప్పుడే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో వారు దిగినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. ఢిల్లీలోని ప్రార్థన మందిరానికి వెళ్లొచ్చాకే వారిలో లక్షణాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా తీగ లాగితే డొంక కదిలింది. నాటి నుంచి ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రతి జిల్లాను జల్లెడ పట్టాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి జాడను కనుగొన్నాయి. మార్చి 21న కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్‌ చేసింది. కాగా, ఇప్పటికే గుర్తించిన వారందర్నీ ఆయా జిల్లాల్లోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. అవసరమైతే వారికీ కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారి కుటుంబాల నుంచి ఇతరులకు ఇన్‌ఫెక్ట్‌ కాకుండా దృష్టిపెట్టారు.

మూడో దశలోకి వెళ్లినట్టేనా!
మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారితోనే సమస్య నెలకొందని భావించిన సర్కారు, ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో తలలు పట్టుకుంటోంది. ఈ 1,030 మంది ఇంకెందరిని కలిసి ఉంటారనేది వైద్యాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొదటి కరోనా కేసుగా నమోదైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 86 మందితో క్లోజ్‌గా ఉన్నా, ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. బయటి నుంచి వచ్చిన పాజిటివ్‌ కేసులు, వారి ద్వారా అంటించుకున్న వారు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 20 మందికి సోకడం, వారిలో ఆరుగురు చనిపోవడంతో వైరస్‌ జన సమూహంలోకి ఏ మేరకు వెళ్లిందోననేది వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇలా వైరస్‌ జన సమూహంలోకి పోవడాన్నే కరోనా మూడో దశగా వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ దశలో బాధితుల్ని గుర్తించడం కష్టంగా మారుతుందని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement