breaking news
-
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్‌లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్‌కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
జస్ట్ మిస్.. కొద్దిలో గట్టెక్కింది వీరే.. భారీ మెజార్టీ వీళ్లదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్లాన్ జరుగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్‌తో, భారీ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
ప్రజాసేవలో డాక్టర్లు..!
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు. ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. -
కమల వికాసం.. విలాపం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్‌కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. నిజంకాని అంచనాలు.. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్లో), ధర్మపురి అరి్వంద్ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్‌లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్‌లలో), ఎం. రఘునందన్‌రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది. ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్‌ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వివేక్, రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. -
జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో లక్ష్మణ్‌గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్ తేజావత్ సంపత్‌నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్ సింబల్‌కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్‌కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్‌లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
గ్రేటర్ ఓటు బీఆర్ఎస్కే..
సాక్షి, హైదరాబాద్, సాక్షి, మేడ్చల్ జిల్లా, సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ నగరంలో అధికార బీఆర్ఎస్ సత్తా చూపింది. కోర్‌సిటీ(పాత ఎంసీహెచ్) పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏడింట సిట్టింగ్లుండగా, తిరిగి వాటిని కైవసం చేసుకుంది. ముషీరాబాద్ (ముఠాగోపాల్), అంబర్‌పేట(కాలేరు వెంకటేశ్), ఖైరతాబాద్(దానం నాగేందర్), జూబ్లీహిల్స్(మాగంటి గోపీనాథ్), సనత్‌నగర్(తలసాని శ్రీనివాస్‌యాదవ్), సికింద్రాబాద్(పద్మారావు)నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఈసారి ఆయన కుమార్తె లాస్యనందితకు టికెట్టివ్వగా ఆమె గెలుపొందారు. గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు డి.సు«దీర్‌రెడ్డి(ఎల్బీనగర్), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), అరికపూడి గాం«దీ(శేరిలింగంపల్లి), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం) తిరిగి గెలుపొందారు. మేడ్చల్ జిల్లాలో 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేడ్చల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి రెండోసారి గెలుపొందగా, కుత్బుల్లాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మూడోసారి ఘనవిజయం సాధించి హాట్రిక్ కొట్టారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు కూడా మూడో సారి గెలుపొంది,హాట్రిక్ సాధించారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు. అలాగే, మల్కాజిగిరిలో కూడా చామకూర మల్లారెడ్డి స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మొదటి సారి విజయం సాధించారు. రంగారెడ్డిలో కారు హవా.. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల బీఆర్ఎస్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మహేశ్వరం నుంచి పోటీచేసిన మంత్రి సబితారెడ్డి మూడోసారి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కాలె యాదయ్య మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున షాద్‌నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. నాలుగు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్ చేయడంతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలకంగా ఉన్న పైలెట్ రోహిత్‌రెడ్డి తాండూరులో బుయ్యని మనోహర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ఈసారి గెలుపు బావుటా ఎగరేశారు. పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డిపై గెలుపొందారు. -
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది..
‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్‌కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలిసారిగా 9 మంది.. ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం. వనపర్తిలో గలాటా.. వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రులకు తప్పని ఓటమి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒక్కటి మినహా. అన్నింటా హస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు. మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్‌రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం. గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు. బీఆర్ఎస్పై అదే దెబ్బ.. గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్ఎస్కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు. కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్‌రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది. ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు. నర్సంపేటనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. విలక్షణం.. ఇందూరు తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్లో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్‌పై విజయం సాధించారు. పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్‌రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు. పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్‌రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
ఆరుగురు మంత్రులు ఔట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా రాష్ట్ర మంత్రివర్గంలోని 17 మంది మంత్రులకుగాను 14 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ 14 మందిలో ఎనిమిది మంది విజయం సాధించగా, ఆరుగురు ఓటమి పాలయ్యారు. మిగతా ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ (హోం), సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమం), పట్నం మహేందర్‌రెడ్డి (సమాచార, పౌర సంబంధాలు) శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), పువ్వాడ అజయ్ (ఖమ్మం), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) ఓటమి పాలయ్యారు. మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), గంగుల కమలాకర్ (కరీంనగర్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట) విజయం సాధించారు. కామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేశారు. వీటిలో కామారెడ్డిలో పరాజయం పాలుకాగా.. గజ్వేల్‌లో మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించారు. కేసీఆర్ గత 40 ఏళ్లలో తొలిసారి ఒక ఎన్నికలో ఓడిపోవడం గమనార్హం. 1983లో తొలిసారిగా సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ స్థాపించాక 2001 ఉపఎన్నిక, 2004 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో కరీంనగర్ ఎంపీగానూ పోటీ చేసి గెలవడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2006, 2008లలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్, 2014లో మెదక్ ఎంపీగానూ విజయం సాధించారు. 2014, 2018తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నాటి తొలి ఓటమి తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ పరాజయం పొందడం గమనార్హం. చీఫ్ విప్ సహా విప్ల ఓటమి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లుగా పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పరాజయం పాలయ్యారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బరిలో దిగలేదు. పోటీ చేసిన ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ పశ్చి మ), బాల్క సుమన్ (చెన్నూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), గొంగిడి సునీత (ఆలేరు) ఓటమి చెందారు. -
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నెరవేరని ‘హ్యాట్రిక్’ కల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడుమార్లు అధికారంలోకి వచ్చి ‘హ్యాట్రిక్’సాధించేందుకు భారత్ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డినా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. పార్టీ పేరు మార్పుతో ఓ వైపు జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి బాటలు వేసుకుంటూనే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడాది కాలంగా సన్నద్ధమైనా అధికారం పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని బీ ఫామ్‌ల జారీ, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఎన్నికల ప్రచార సభలు తదితరాలు అన్నింటా విపక్ష పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉన్నా.. అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు చేరువ కాలేకపోయింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 104 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండటం, అందులో సంగం మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండు కంటే ఎక్కువ పర్యాయాలు గెలిచిన వారే ఉండటం ప్రతికూలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 35 మంది పార్టీ ఎమ్మెల్యేలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రతికూలత నెలకొందని నిఘా వర్గాలు, వివిధ సంస్థలు నివేదికలు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాన్ని కలిగించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చక పోవడం వల్ల నష్టం జరిగిందని తేలినా.. మళ్లీ ‘సిట్టింగులకే టికెట్లు’అంటూ పెద్దపీట వేయడం నష్టం చేకూర్చినట్లు ఫలితాల సరళి వెల్లడిస్తోందని అంటున్నారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి అవకాశమిచ్చిన చోట 9 మంది గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, రుణ మాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితబంధు, బీసీబంధు పథకాలు వంటి అంశాలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వ్యవహార శైలి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టడంలో కీలకంగా మారాయని అంటున్నారు. స్థానికంగా దృష్టి కేంద్రీకరించలేకపోయారా? ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి తొలి విడతలో జిల్లా కలెక్టరేట్లు, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సభలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలతో కేడర్‌ను కార్యోన్ముఖుల్ని చేసే పనికి పూనుకున్నారు. జూన్‌లో దశాబ్ది ఉత్సవాల పేరిట సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టులోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అంతర్గత అసమ్మతి సర్దుబాటుకు పూనుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకమునుపే బీ ఫామ్‌లు జారీ చేశారు. ఇంత చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టీఆర్ఎస్ పేరును ఏడాది క్రితం బీఆర్ఎస్గా మార్చడం, పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడంపై పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించే క్రమంలో స్థానికంగా పార్టీ, ప్రభుత్వంపై కేసీఆర్ అంతగా దృష్టి కేంద్రీకరించలేదనే అభిప్రాయం కూడా ఉంది. అభ్యర్థుల ప్రకటనకు ముందూ, తర్వాత టికెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడిన పొంగులేటి, తుమ్మల వంటి నేతలు తీరని నష్టం కలిగించారని అంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ధీటుగా ప్రకటించిన మేనిఫెస్టోను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పాక్షిక ఫలితాన్నే ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘తెలంగాణ మోడల్’కు మిశ్రమ స్పందన భారీగా ఓట్లు సాధిస్తుందని భావించిన ‘తెలంగాణ మోడల్’నినాదం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పొరుగునే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా సీట్లను సాధించి పెట్టింది. అయితే ‘తెలంగాణ మోడల్’లో అంతర్భాగమైన సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయనే లెక్కలు తారుమారై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ, ఇతర జిల్లాల్లో అరకొర ఫలితాన్నే ఇచ్చాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు ఐదు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోకేవలం రెండేసి స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. 2018 ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాన్ని అందించిన నల్లగొండలో సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో గద్వాల, ఆలంపూర్లో మాత్రమే గెలుపు సాధ్యమైంది. మొదట్నుంచీ పార్టీకి పూర్తి ప్రతికూలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటరు ప్రస్తుత ఎన్నికలోనూ అదే తీరును ప్రదర్శించడం గమనార్హం. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలు బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని 15 స్థానాలకు గాను మిత్రపక్షాలైన బీఆర్ఎస్, ఎంఐఎం చెరో ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లకు గాను పది స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రానికి ఓటర్లు ఏకపక్షంగా మద్దతు పలికారు. పొరుగునే ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను మంత్రి హరీశ్‌రావు సర్వశక్తులూ ఒడ్డటంతో సిద్దిపేట, గజ్వేల్ సహా ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లోనూ బీఆర్ఎస్కు ప్రాతినిథ్యం దక్కగా, అధికార పగ్గాలు చేపడుతున్న కాంగ్రెస్‌కు హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటూ దక్కక పోవడం గమనార్హం. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాంహరీశ్రావు సాక్షి, హైదరాబాద్: ‘రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు’అని హరీశ్‌రావు ఆదివారం ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. బీఆర్ఎస్ కార్యకర్తల కఠోర శ్రమకు కృతజ్ఞతలు. అధికారమున్నా లేకున్నా మనం తెలంగాణ ప్రజల సేవకులం. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పోరాడుదాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేకించి శుభాకాంక్షలు’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. హరీశ్‌రావుకు తగ్గిన మెజార్టీ 2018లో 1,18,699.. ఈసారి 82,308 ఓట్లు ఎమ్మెల్యేగా 7వ సారి విజయం సాక్షి, సిద్దిపేట: గత ఎన్నికల కంటే ఈసారి మాజీమంత్రి టి.హరీశ్‌రావుకు 36,391 మెజార్టీ తగ్గింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్‌రావుకు నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 1,81,436 ఓట్లు పోలు కాగా, ఆయన 1,05,514 ఓట్లు సాధించారు. సమీపకాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణపై 82,308 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడోసారి హరీశ్‌రావు విజయం సాధించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి సైతం 20 మంది ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. -
ఎగుడు దిగుడు దారిలో కారు!
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)’రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఉద్యమ సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలను అ్రస్తాలుగా ప్రయోగించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీ నేతృత్వంలోని కూటమితో జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచింది. రాష్ట్ర అవతరణ తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారినట్టు అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీకి వీలుగా టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల దిశగా రంగం సిద్ధం చేసుకుంటూనే.. తెలంగాణలో మూడోసారి అధికారం సాధించి ‘హ్యాట్రిక్’సీఎంగా రికార్డు సృష్టించాలని భావించారు. తర్వాత ‘తెలంగాణ మోడల్’ఆలంబనగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలు కలుపుకొని మొత్తం 65 ఎంపీ సీట్లలో పోటీచేస్తామని బీఆర్ఎస్ గతంలో ప్రకటించింది. కొత్త రాష్ట్రంలో అధికార పీఠం: తెలంగాణ ఏర్పాటుతోపాటు జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 119 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసి 63 సీట్లు సాధించింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి కాలంలో రాజకీయ పునరేకీకరణ పేరిట టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఐల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే 2018 సెపె్టంబర్ 6న అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారు. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెల్చుకుని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. తర్వాతి కాలంలోనూ వివిధ పార్టీల నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అసెంబ్లీలో 104 సంఖ్యాబలానికి చేరుకున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రస్థానం, పై ఆసక్తి నెలకొంది. నాడు ఉప ఎన్నికలతో బలోపేతమై.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ 2001లో టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ను స్థాపించారు. అదే ఏడాది 2001లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగి గెలుపొందారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని..46 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి, 26 స్థానాలును గెలుచుకుంది. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ మాట తప్పిందంటూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. 2006 కరీంనగర్ లోక్‌సభకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే వాటికి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడుగురే టీఆర్ఎస్ అభ్యర్థులు తిరిగి గెలిచారు. ఈ క్రమంలో 2009 సాధారణ ఎన్నికల్లో మహా కూటమితో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుని 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. కానీ పది సీట్లే సాధించింది. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది, 2011 ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. 2012లో టీడీపీ, కాంగ్రెస్‌లకు రాజీనామా చేసిన జోగు రామన్న, గంప గోవర్ధన్, జూపల్లి కృష్ణారావు, తాటికొండ రాజయ్య కూడా టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
రేస్ గెలిచిన కాంగ్రెస్
అంతా ఊహించినట్టుగానే, ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల రేసు గెలిచింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటికే హస్తం పార్టీ ఆధిక్యతపై స్పష్టత వచ్చింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గాలి వీచింది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకత ప్రభావం చూపింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను మేజిక్ ఫిగర్‌ను దాటేసి 64 సీట్లతో హస్తం పార్టీ విజయం సాధించింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ప్రచారంలో ధీమాగా చెప్పిన బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ మొదట్లో డబుల్ డిజిట్ దాటేలా కనిపించినా.. చివరికి ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంఐఎం తమ ఏడు స్థానాలను నిలబెట్టుకున్నా కౌంటింగ్ ఆద్యంతం గట్టి పోటీనే ఎదుర్కొంది. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ఒకచోట గెలవగా.. సీపీఎం, బీఎస్పీ, జనసేన ఖాతా తెరవలేకపోయాయి. ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. గాంధీభవన్, రేవంత్ నివాసం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ బోసిపోయింది. ఫలితాలపై స్పష్టత రాగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తూ లేఖను గవర్నర్‌కు పంపగా, ఆమె వెంటనే ఆమోదించడం జరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు గవర్నర్ తమిళిసైని కలసి కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు. సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సీఎం ఎవరు అవుతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ గురితప్పిందని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎదురుదెబ్బలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకోవడం తమకు అలవాటేనని పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ ఇచ్చిన ‘మార్పు’నినాదం ప్రజల్లోకి వెళ్లింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రభావం చూపింది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ స్థానాలకుగాను 118 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీసం 60 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉండగా.. నాలుగు సీట్లు ఎక్కువే ‘చే’జిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తొలిసారిగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా రెండుసార్లు గెలిచి తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 119 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. సిట్టింగ్ మంత్రుల్లో ఆరుగురు ఓడిపోగా, చీఫ్ విప్, మరో ముగ్గురు విప్‌లకూ ఓటమి తప్పలేదు. కొన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపించినా.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆదరణతో బీఆర్ఎస్ గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు దక్కించుకుంది. ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని, 111 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకేచోట గెలిచిన కాషాయ పార్టీకి సంఖ్యాబలం పెరగడం ఊరట కలిగించే అంశమే. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 7 సిట్టింగ్ స్థానాలను గెలిచి.. హైదరాబాద్ పాతబస్తీలో తన పట్టు నిలుపుకొంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించింది. ఖాతా తెరవని బీఎస్పీ, సీపీఎం, జనసేన ► రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గత నెల 30న జరగగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 107 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ.. బీజేపీతో పొత్తులో భాగంగా 8 చోట్ల పోటీ చేసిన జనసేన, 19 స్థానాల్లో బరిలో ఉన్న సీపీఎం, ఒక స్థానంలో పోటీచేసిన సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీలు ఖాతా తెరవలేదు. ► రాష్ట్రంలోనే అత్యధికంగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు ఏకంగా 85,576 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ► బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో పోటీచేయగా.. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,031 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కామారెడ్డిలో ఓడిపోయారు. ► టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 32,532 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై విజయం సాధించారు. ► సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు 82,308 ఓట్ల మెజార్టీతో, సిరిసిల్లలో కేటీఆర్ 29,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ► స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో 23,464 ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసినవారు తిరిగి గెలవరనే సెంటిమెంట్‌ను ఆయన తిరగరాశారు. ► కాంగ్రెస్ సీనియర్లలో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, జి.వివేక్, జి.వినోద్, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు గెలుపొందగా.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, షబ్బీర్ అలీ తదితరులు ఓటమి పాలయ్యారు. బీజేపీ ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి గెలవలేకపోయారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలవడం గమనార్హం. బొటాబొటి ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
మార్పునకే తెలంగాణ ఓటు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వాదన గెలిచింది? ఏ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది? ఓటరు దేన్ని విశ్వసించాడు? దేనికి ప్రభావితుడయ్యాడు? సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. రాజకీయ పార్టీల విశ్లేషణ కూడా ఇదే. ఈసారి ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమ పథకాల హామీల్లో ప్రధాన పార్టీలూ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సామాజిక సమీకరణలనూ తెరమీదకు తెచ్చాయి. ఇవి ఓట్లు రాలుస్తాయని భావించాయి. అయితే ఈసారి ప్రజాక్షేత్రంలో పార్టీల ప్రచారం, నినాదాలు ఒక స్థాయి వరకే పరిమితం కాలేదు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కొత్త అంశాలను అ్రస్తాలుగా ఎంచుకున్నాయి. ఈవీఎంలు ఫలితాలు నిర్దేశించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలే ఈసారి బలమైన ప్రభావం చూపాయనేది సుస్పష్టం. – సాక్షి, హైదరాబాద్ దూసుకెళ్లిన మార్పు రెండు దఫాలు పాలించిన బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రంతో మూడోసారి అధికారమివ్వమని కోరింది. దీన్ని బలమైన నినాదంగా ఆ పార్టీ భావించింది. కాంగ్రెస్ మాత్రం ‘మార్పు కావాలి ... కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. ‘ఒక్క అవకాశం ఇవ్వమనే’అభ్యర్థన బీఆర్ఎస్ నినాదం కన్నా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సంప్రదాయ కాంగ్రెస్ నినాదాలకు విరుద్ధంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళిన మార్పు కావాలనే నినాదం బలంగా పనిచేసినట్టు కన్పిస్తోంది. అభివృద్ధి కన్పించిన జిల్లాల్లోనూ బీఆర్ఎస్ ఈసారి ప్రతికూలత చవి చూడటమే ఇందుకు కారణం. తిరుగులేదని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో పాగా వేసింది. కాంగ్రెస్ ‘ఆరు హామీ’ల్లో కొద్దిపాటి కొత్తదాన్ని జొప్పించారు. మహిళలకు రూ. 2500, కౌలు రైతులు, రైతుకూలీలకు సహాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో కన్పించిన కొత్త అంశాలు. గ్రామీణ మహిళా ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టంగట్టడం చూస్తుంటే ఈ నినాదాలు ఆకట్టుకున్నాయనేది స్పష్టం. ఈసారి యువ ఓటరు పోలింగ్‌కు పోటెత్తడం, కాంగ్రెస్‌కు ఆకర్షితులవ్వడం విశేషం. ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీకి... జాబ్ క్యాలెండర్‌ను జోడించడం మరింత నమ్మకాన్ని చేకూర్చింది. అధికార పార్టీ అవినీతి నినాదాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ బలమైన స్థానాలే కాదు... కాంగ్రెస్ బలమైన స్థానాల్లోనూ దీని ప్రభావం కన్పించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న రాజకీయ నినాదం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దీనివల్ల ప్రయోజనమూ పొందింది. కొన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్ పక్షానికి మళ్ళడం ఫలితాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. నిష్ఫలమైన బీఆర్ఎస్ అస్త్రాలు బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో అభివృద్ధినే నమ్ముకుంది. అమలు చేసిన సంక్షేమాన్నే ప్రచార ఆయుధంగా చేసుకుంది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, పెన్షన్లను నినాదాలుగా మార్చింది. పాజిటివ్ మార్గంలోనే ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. ప్రతీ పథకంలోనూ మరింత పెంపును జోడించింది. కానీ రానురాను బీఆర్ఎస్ ప్రచార సరళి మార్చింది. పాజిటివ్ నుంచి కాంగ్రెస్‌పై విరుచుకుపడే నెగెటివ్ సరళిని ఎంచుకుంది. దీన్ని ఆ పార్టీ అనివార్యంగా భావించింది. ‘మళ్ళీ కాంగ్రెస్ వస్తే...’కరెంట్ ఉండదు.. మత కలహాలు వస్తాయి... ముఖ్యమంత్రులు మారతారు... అభివృద్ధి కుంటుపడుతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేస్తుందని భావించింది. నెగెటివ్ ప్రచార సరళి అప్పటి వరకూ జరిగిన పాజిటివ్ ఓటింగ్‌ను డామినేట్ చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వల్ల నష్ట నివారణకు ... ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రజాక్షేత్రాన్ని ఇవేవీ అందుకోలేకపోయాయి. అభివృద్ధి కన్పించే ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ అనుకున్న రీతిలో లాభపడకపోవడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రజల అభిమానం చూరగొనలేని అభ్యర్థుల వల్ల బీఆర్ఎస్ ఎన్నికల అ్రస్తాలన్నీ నిష్ఫలమయ్యాయా? అనే చర్చ విన్పిస్తోంది. కమలానికి కలిసి రాని బీసీ మంత్రం బీజేపీ సీట్లు, ఓట్లు పెరగడానికి కారణాలేంటి? మోదీ, షాల ప్రచారమా? ఆ పార్టీ ఎన్నికల నినాదమా? అన్ని వర్గాల్లో జరిగే చర్చ ఇది. ఏడాది క్రితం ఊపు పెంచిన బీజేపీ ఎన్నికల వేళ చతికిల పడ్డా... ఆశాజనకమైన ఫలితాలనే చవిచూసింది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పింది. బీసీ నేతలకే ప్రధాన భూమికని చెప్పింది. అయితే, బీసీలుగా చెప్పుకునే బలమైన నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. దీన్నిబట్టి బీజేపీ బీసీ నినాదాన్ని ప్రజలు విశ్వసించలేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు ఎక్స్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై ఏఐసీసీ అ«ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రజలకు ఎక్స్ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చామని, అయితే అక్కడి ఫలితాలు నిరాశపరిచాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీపై అభిమానం చూపి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డ కార్యకర్తల సేవలను గుర్తిస్తున్నట్లు వివరించారు. ఒడిదుడుకులను అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధపడతామంటూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గెలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు అభినందనలు ఏపీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో గెలుపొంది అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా ఆయా పార్టీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచిన బీజేపీకి, పొరుగు రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. హామీలన్నీ అమలు చేస్తాం రాహుల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన, మద్దతు పలికిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరిత్ర సృష్టించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలిపారు. ఇది ప్రజలతోపాటు కార్యకర్తలందరి విజయమని ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. ఆశించిన విధంగానే ప్రజలు ఫలితాన్నిచ్చారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నరకాసురుడి పాలనకు ముగింపు పలుకుతామని, హిట్లర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని ఏడాదిగా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెప్పినట్లుగానే ఫలితం ఇచ్చారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్, పాలేరు అభ్యర్థి గా గెలిచాక పొంగులేటి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల అభీష్టం, అభిప్రాయాలకు భిన్నమైన పాలన సాగించడంతోనే బీఆర్ఎస్కు ఈ రకమైన ఫలితాలొచ్చాయని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై తీర్మానం చేస్తామని, వంద రోజుల్లోనే ఇవి కార్యరూపం దాల్చేలా చర్యలుంటాయని పొంగులేటి వెల్లడించారు. గాందీభవన్ కళకళ సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గాందీభవన్ పరిసరాలు తొలిసారి కళకళలాడాయి. గత పదేళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినా గాందీభవన్ బోసిపోతూ కనిపించేది. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా గాంధీభవన్‌లో హడావుడి నెలకొంది. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఉదయం 9 గంటల నుంచే గాందీభవన్ బాట పట్టాయి. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ పార్టీకి ఆధిక్యం పెరగటంతో గాందీభవన్ పరిసరాలు మారుమోగాయి. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేడర్ సంబురాలు చేసుకుంది. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
పడి లేచిన కెరటంలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పడి లేచిన కెరటంలా దూసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితమైనా.. 2018లో 19 స్థానాలతోనే చతికిలపడినా.. మూడో ప్రయత్నంలో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 64 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బీఆర్ఎస్ సర్కారుపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ సంస్థాగత బలం కూడా ఈ విజయానికి దోహదపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడలి తరంగంలా ముందుకు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడిన కాంగ్రెస్.. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ విజయాన్ని ముద్దాడలేకపోయింది. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీల వరకు అన్నిస్థాయిల్లోని వందల మంది నేతలు పార్టీని వీడటం సమస్యగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలుచుకున్న హస్తం పార్టీ.. తర్వాత జరిగిన హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కానీ క్రమంగా పుంజుకుని ఎన్నికల నాటికి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగింది. సత్ఫలితాలిచ్చిన వ్యూహాలు.. హామీలు.. ప్రచారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. పార్టీ నేతలు ఐక్యంగా తలపెట్టిన బస్సుయాత్ర వంటివి ప్రజల్లో సానుకూలత పెంచాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి తోడు సోనియా, రాహుల్, ప్రియాంకల ప్రచారం కూడా కలసి వచ్చింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలూ ప్రజల్లోకి వెళ్లాయి. జాబ్ కేలండర్ పేరుతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని తేదీలతో సహా ప్రకటించడం నిరుద్యోగులను ఆకట్టుకుంది. ఆ14 సీట్లు ‘హస్త’గతం చాలా కాలం నుంచి గెలుపు కోసం ఎదురుచూస్తున్న 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఈసారి అనూహ్య విజయం సాధించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో దశాబ్దాలుగా దక్కని విజయం ఈసారి సాకారమైంది. చెన్నూరులో 2004లో గెలిచిన కాంగ్రెస్ 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ గెలిచారు. 2009లో బెల్లంపల్లి స్థానం ఏర్పడ్డాక కాంగ్రెస్ (గడ్డం వినోద్) గెలవడం ఇదే మొదటిసారి. మంచిర్యాలలోనూ కాంగ్రెస్ తొలిసారి విజయం సాధించింది. నాలుగుసార్లు (ఉప ఎన్నిక సహా) ఓటమి తర్వాత ఈసారి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు మంచి మెజార్టీతో గెలుపొందారు. ఖానాపూర్‌లో 1989 తర్వాత కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడే. కె.భీంరావు తర్వాత వెడ్మ బొజ్జు కాంగ్రెస్ నుంచి మళ్లీ విజయం సాధించారు. జుక్కల్ ఎస్సీలకు రిజర్వు అయిన తర్వాత జరిగిన జరిగిన 11 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఇది ఐదోసారే. నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ తొలిసారి గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు 1978, 2008లో కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లిలో 34 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. 1989లో గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. వరుసగా ఆరుసార్లు ఓడాక మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు విజయం సాధించారు. దేవరకద్రలోనూ కాంగ్రెస్ (జి.మధుసూదన్‌రెడ్డి) తొలిసారి గెలిచింది. నాగర్‌కర్నూల్‌లో 1989 తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది ఇప్పుడే. డాక్టర్ రాజేశ్‌రెడ్డి కూచుకుళ్ల గెలిచారు. 1983 తర్వాత (40 ఏళ్లకు) ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. మెదక్‌లో 1989 తర్వాత ఇప్పుడే కాంగ్రెస్‌ను విజయం వరించింది. మైనంపల్లి రోహిత్ గెలుపొందారు. మహబూబ్‌నగర్‌లో 1989లో పులి వీరన్న కాంగ్రెస్ అభ్యర్థి గా గెలుపొందారు. తర్వాత వరుసగా ఏడుసార్లు ఓటమి పాలైన తర్వాత ఈసారి యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. భువనగిరిలోనూ 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కుంభం అనిల్ గెలుపొందారు. నర్సంపేటలో 1957, 67లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు. -
ఇంకో 5 గెలిచి ఉంటే.. బిందాస్!
సాక్షి, హైదరాబాద్ : ‘‘అబ్బా ఎలాగూ గెలిచాం.. మరో ఐదు స్థానాలు గెలుచుకుని ఉంటే ఇంకా బాగుండేది. టెన్షన్ పోయేది.. ఎన్నో తలనొప్పులు తప్పేవి..’’.. అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ దాటినా కూడా కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది. ప్రజలు అధికారమిచ్చారే గానీ.. మంచి మెజారిటీ ఇవ్వలేదనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటై తొలుత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లలోనే గెలవగా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అంతకంటే ఒకేసీటు ఎక్కువగా వచ్చింది. ఈ క్రమంలో కొందరు పార్టీ ఫిరాయించినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుందని నేతలు చెప్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాకచక్యంగా ఢీకొట్టేందుకు, పాలనలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు మరో ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు ఉండి ఉంటే బాగుండేదని అంటున్నారు. తక్కువ మెజారిటీ కారణంగా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర షిండేతో శివసేనను చీల్చినట్టుగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందే సిద్ధమై ఉండాలని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. వీడినవారు మళ్లీ వస్తారా? కాంగ్రెస్‌లో చాలాకాలం పనిచేసి బీఆర్ఎస్లోకి వెళ్లినవారిలో కొందరు ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరత కోసం అలాంటి వారిని తిరిగి రప్పించుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడే ఇలాంటి పరిణామాలకు ఆస్కారం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త సుస్థిరత సాధించాకే ఏవైనా ప్రయోగాలకు సిద్ధమవుతుందని నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎదురవుతాయని భావిస్తున్న పరిణామాలను ఢీకొట్టేందుకు ఇప్పటినుంచే రూట్‌మ్యాప్ తయారవుతుందని, వందేళ్ల చరిత్ర కలిగిన తమకు అధికారం నిలుపుకోవడం ఎలాగో తెలుసని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్ నేతలంతా గెలవడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండులుగా పేరొందిన నేతలు చాలా మంది ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, జి. వివేక్ వెంకటస్వామి, పి.సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు గెలిచారు. సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులకు అవకాశం ఉండబోదని, ఐదేళ్ల పాటు అధికారం పదిలంగా ఉంటుందనే ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధిష్టానానికీ కత్తిమీద సామే బొటాబొటీ మెజారిటీ పరిస్థితుల్లో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సామేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో సీఎం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి ప్రాధాన్యం లభించకపోయినా అలిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీఎం విషయంలో ఎమ్మెల్యేలను ఒప్పించినా.. తర్వాత మంత్రివర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ పదవులు వంటి చాలా వ్యవహారాల్లో అధిష్టానం తిప్పలు పడాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. -
పార్టీ మారినా.. ఓటమి తప్పలే..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ 2018 ఎన్నికల్లో గెలుపొందిన విపక్ష ఎమ్మెల్యేల్లో 16 మంది బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరికి ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో 14 మంది బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ –ఎస్టీ), స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావ్యుడా రాములు నాయక్ (వైరా ఎస్టీ) బీఆర్ఎస్లో చేరినా ప్రస్తుత ఎన్నికలో టికెట్ దక్కలేదు. గత ఎన్నికలో టీడీపీ నుంచి గెలుపొందిన మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట ఎస్టీ), సండ్ర వెంకట వీర య్య (సత్తుపల్లి ఎస్సీ)తో పాటు కాంగ్రెస్ నుంచి 12 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), సుదీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్ ఎస్సీ), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), రేగా కాంతారావు (పినపాక ఎస్టీ), హరిప్రియ భానోత్ (ఇల్లందు ఎస్టీ), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్రావు (కొత్తగూడెం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ఎస్టీ) బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (ఎల్బీనగర్) మాత్రమే తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ వీడి.. గెలుపుతీరానికి చేరి.. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరి టికెట్లు దక్కించుకున్న పలువురు నేతలు గెలుపు తీరాలకు చేరారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా నిరాకరించి కాంగ్రెస్‌లోకి వెళ్లి తనతో పాటు తన కుమారుడికి టికెట్ సాధించుకున్న మైనంపల్లి హన్మంతరావు మాత్రం ఓటమి చెందారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), మందుల సామేలు (తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), మనోహర్‌రెడ్డి (తాండూరు), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), కూచుకుళ్ల రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి కుమారుడు), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్) గెలుపొందారు. సరితా తిరుపతయ్య (గద్వాల), శ్యామ్ నాయక్ (ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త – ఆసిఫాబాద్), జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి) తదితరులు కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలుపు తీరాలకు చేరలేక పోయారు. బోగా శ్రావణి (జగిత్యాల), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), కందుల సంధ్యారాణి (రామగుండం), పులిమామిడి రాజు (సంగారెడ్డి), కేసీఆర్ రత్నం (చేవెళ్ల) బీజేపీలో, నీలం మధు (పటాన్చెరు) బీఎస్పీలో చేరి టికెట్లు దక్కించుకున్నా ఫలితం లేకపోయింది. -
ఓడిపోయిన అనుభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే... ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. ♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. ♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. ♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్దీ ఇదే పరిస్థితి. ♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. ♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. ♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. -
‘విక్రమార్కుడి’ విజయ పరంపర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్‌రాజ్‌కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్రాజ్పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. ‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.