పడి లేచిన కెరటంలా..  | Congress came to power for the first time in the state | Sakshi
Sakshi News home page

పడి లేచిన కెరటంలా.. 

Dec 4 2023 4:22 AM | Updated on Dec 4 2023 8:53 AM

Congress came to power for the first time in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ పడి లేచిన కెరటంలా దూసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితమైనా.. 2018లో 19 స్థానాలతోనే చతికిలపడినా.. మూడో ప్రయత్నంలో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి 64 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ సర్కారుపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌ సంస్థాగత బలం కూడా ఈ విజయానికి దోహదపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కడలి తరంగంలా ముందుకు.. 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడిన కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ విజయాన్ని ముద్దాడలేకపోయింది. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీల వరకు అన్నిస్థాయిల్లోని వందల మంది నేతలు పార్టీని వీడటం సమస్యగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలుచుకున్న హస్తం పార్టీ.. తర్వాత జరిగిన హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కానీ క్రమంగా పుంజుకుని ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగింది.

సత్ఫలితాలిచ్చిన వ్యూహాలు.. హామీలు.. ప్రచారం 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. పార్టీ నేతలు ఐక్యంగా తలపెట్టిన బస్సుయాత్ర వంటివి ప్రజల్లో సానుకూలత పెంచాయి. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి తోడు సోనియా, రాహుల్, ప్రియాంకల ప్రచారం కూడా కలసి వచ్చింది. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ హామీలూ ప్రజల్లోకి వెళ్లాయి. జాబ్‌ కేలండర్‌ పేరుతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని తేదీలతో సహా ప్రకటించడం నిరుద్యోగులను ఆకట్టుకుంది.

ఆ14 సీట్లు ‘హస్త’గతం
చాలా కాలం నుంచి గెలుపు కోసం ఎదురుచూస్తున్న 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఈసారి అనూహ్య విజయం సాధించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో దశాబ్దాలుగా దక్కని విజయం ఈసారి సాకారమైంది.  

చెన్నూరులో 2004లో గెలిచిన కాంగ్రెస్‌ 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ గెలిచారు.  

2009లో బెల్లంపల్లి స్థానం ఏర్పడ్డాక కాంగ్రెస్‌ (గడ్డం వినోద్‌) గెలవడం ఇదే మొదటిసారి.

మంచిర్యాలలోనూ కాంగ్రెస్‌ తొలిసారి విజయం సాధించింది. నాలుగుసార్లు (ఉప ఎన్నిక సహా) ఓటమి తర్వాత ఈసారి అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు మంచి మెజార్టీతో గెలుపొందారు.

ఖానాపూర్‌లో 1989 తర్వాత కాంగ్రెస్‌ గెలిచింది ఇప్పుడే. కె.భీంరావు తర్వాత వెడ్మ బొజ్జు కాంగ్రెస్‌ నుంచి మళ్లీ విజయం సాధించారు.  

జుక్కల్‌ ఎస్సీలకు రిజర్వు అయిన తర్వాత జరిగిన జరిగిన 11 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం ఇది ఐదోసారే.

నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ తొలిసారి గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు 1978, 2008లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

పెద్దపల్లిలో 34 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. 1989లో గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. వరుసగా ఆరుసార్లు ఓడాక మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు విజయం సాధించారు.

దేవరకద్రలోనూ కాంగ్రెస్‌ (జి.మధుసూదన్‌రెడ్డి) తొలిసారి గెలిచింది.

నాగర్‌కర్నూల్‌లో 1989 తర్వాత కాంగ్రెస్‌ విజయం సాధించింది ఇప్పుడే. డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి కూచుకుళ్ల గెలిచారు.

1983 తర్వాత (40 ఏళ్లకు) ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ గెలిచింది. అక్కడ మల్‌రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. 

మెదక్‌లో 1989 తర్వాత ఇప్పుడే కాంగ్రెస్‌ను విజయం వరించింది. మైనంపల్లి రోహిత్‌ గెలుపొందారు.  

మహబూబ్‌నగర్‌లో 1989లో పులి వీరన్న కాంగ్రెస్‌ అభ్యర్థి గా గెలుపొందారు. తర్వాత వరుసగా ఏడుసార్లు ఓటమి పాలైన తర్వాత ఈసారి యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.  

భువనగిరిలోనూ 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడ కుంభం అనిల్‌ గెలుపొందారు.  

నర్సంపేటలో 1957, 67లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement