గ్రేటర్‌ ఓటు బీఆర్‌ఎస్‌కే..  | Greater vote to BRS | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ ఓటు బీఆర్‌ఎస్‌కే.. 

Dec 4 2023 5:04 AM | Updated on Dec 4 2023 8:48 AM

Greater vote to BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్, సాక్షి, మేడ్చల్‌ జిల్లా, సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్‌ నగరంలో అధికార బీఆర్‌ఎస్‌ సత్తా చూపింది. కోర్‌సిటీ(పాత ఎంసీహెచ్‌) పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏడింట సిట్టింగ్‌లుండగా, తిరిగి వాటిని కైవసం చేసుకుంది. ముషీరాబాద్‌ (ముఠాగోపాల్‌), అంబర్‌పేట(కాలేరు వెంకటేశ్‌), ఖైరతాబాద్‌(దానం నాగేందర్‌), జూబ్లీహిల్స్‌(మాగంటి గోపీనాథ్‌), సనత్‌నగర్‌(తలసాని శ్రీనివాస్‌యాదవ్‌), సికింద్రాబాద్‌(పద్మారావు)నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే గెలుపొందారు.

కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఈసారి ఆయన కుమార్తె లాస్యనందితకు టికెట్టివ్వగా ఆమె గెలుపొందారు. గ్రేటర్‌ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు డి.సు«దీర్‌రెడ్డి(ఎల్‌బీనగర్‌), ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌), అరికపూడి గాం«దీ(శేరిలింగంపల్లి), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం) తిరిగి గెలుపొందారు.  

మేడ్చల్‌ జిల్లాలో 5 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం.. 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేడ్చల్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి రెండోసారి గెలుపొందగా, కుత్బుల్లాపూర్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మూడోసారి ఘనవిజయం సాధించి హాట్రిక్‌ కొట్టారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు కూడా మూడో సారి గెలుపొంది,హాట్రిక్‌ సాధించారు. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు. అలాగే, మల్కాజిగిరిలో కూడా చామకూర మల్లారెడ్డి స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మొదటి సారి విజయం సాధించారు. 

రంగారెడ్డిలో కారు హవా.. 
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల బీఆర్‌ఎస్, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మహేశ్వరం నుంచి పోటీచేసిన మంత్రి సబితారెడ్డి మూడోసారి వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టారు. చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కాలె యాదయ్య మూడోసారి 

గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ నుంచి ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున షాద్‌నగర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 

వికారాబాద్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌!  
వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభంజనం  కొనసాగింది. నాలుగు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్‌ చేయడంతో పీసీసీ  చీఫ్‌ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సంబరాలు మిన్నంటాయి.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలకంగా ఉన్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరులో బుయ్యని మనోహర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఈసారి గెలుపు బావుటా ఎగరేశారు. పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డిపై గెలుపొందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement