సాక్షి, చెన్నై : నడిసంద్రంలో పయనిస్తున‍్న పడవకు ఒక‍్కసారిగా రంధ్రం పడింది. పడవలోని 20 మంది జాలర్లు భయాందోళనకు గురయ్యారు. వారంతా జాలర్లు కావడంతో ప్రమాదాన్ని పసిగట్టి చాకచక‍్యంగా ఒడ్డున పడ్డారు. ఈ సంఘటన చెన్నై తీరంలో శనివారం చోటుచేసుకుంది. చెన్నైలోని కాశిమేడుకు చెందిన ఇరవై మంది జాలర్లు ఓ పడవలో శనివారం తెల్లవారుజామున చేపల వేటకు బయలుదేరారు. ఉదయం ఎనిమిది గంటలకు వీరంతా బంగాళాఖాతంలోని తీర్పు దిశగా తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని నడి సంద్రానికి చేరుకున్నారు. ఇక చేపల వేటకు వలలు వేసేందుకు సిద్దంమవుతుండగా పడవ మధ‍్యలో కింద నుండి ఓ రంద్రం ఏర్పడటం గమనించారు.
ఆ రంధ్రం నుండి పడవలోకి నీరు రావటం అధికమవుతుండటంతో ప్రమాదాన్ని గ్రహించిన జాలర్లు దైర్యంగా రంద్రాని మూసే ప్రయత్నం చేస్తూనే నీటిని బయటకు తోడేశారు. రంధ్రం నుండి నీరు పడవలోకి చేరుకోవటాన్ని అడ్డుకుని అక్కడి నుండి హుటాహుటిన ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా శ్రమించి ఎలాగోలా గాలిదిశగా వస్తూ చివరకు ఈసీఆర్ రోడ్డులోని పెరుందురై కుప్పం తీరానికి చేరుకున్నారు. అక్కడ తాళ్లతో పడవను ఒడ్డుకు చేర్చిన జాలర్లు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు వారిని స‍్వంత ప్రాంతాలకు తరలించారు.