'రాష్ట్రంలో ఉపాధి లేకే ఈ దుస్థితి'
రాష్ట్రంలో ఉపాధి లేకే కూలీలు హైదరాబాద్ వలస వెళ్లాల్సి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు.
విజయనగరం: రాష్ట్రంలో ఉపాధి లేకే కూలీలు హైదరాబాద్ వలస వెళ్లాల్సి వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను వారి స్వగ్రామమైన విజయనగరం జిల్లా చిలకలపల్లిలో సోమవారం రాత్రి ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధి పనులు ఇవ్వకపోవడంతో కూలీలకు పొట్ట గడవడం కష్టంగా మారిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో రాష్ట్రంలో 98 శాతం కూలీలకు ఉపాధి కల్పించారన్నారు. ఇప్పుడు యంత్రాలతో పని చేయించడంతో కూలీలకు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మరో రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు తెలంగాణ బిల్డర్తో పాటు టీ-సర్కార్ నుంచి ఒక్క పైసా కూడా పరిహారం అందలేదన్నారు. బాధితులు కోరితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందిస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నానక్‌రామ్ గూడలో కుప్పకూలిన భవనం ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. (చదవండి : మృత్యుఘోష )


