‘కాంగ్రెస్’ల పోరు | Vasan names his new party Tamil Maanila Congress | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్’ల పోరు

Dec 28 2014 2:12 AM | Updated on Sep 2 2017 6:50 PM

రాష్ట్రంలోని రెండు ‘కాంగ్రెస్’ల మధ్య పోరు ఊపందుకుంది. ఉన్నవారు చేజారకుండా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ), వలసలకు వలవేస్తూ

చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని రెండు ‘కాంగ్రెస్’ల మధ్య పోరు ఊపందుకుంది. ఉన్నవారు చేజారకుండా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ), వలసలకు వలవేస్తూ తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) పోటాపోటీగా సిద్ధం అవుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ మూడు దశాబ్దాల క్రితమే స్వయంశక్తిని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల అండే దిక్కుగా నెట్టుకొస్తోంది. కామరాజనాడార్ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ఆ పార్టీ నేతలే ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో గడిచిన పార్లమెంటు ఎన్నిక లు రాష్ట్ర కాంగ్రెస్‌ను మరింత దీనావస్థలోకి నెట్టేశాయి. పదేళ్ల పాలన తో అనేక అప్రతిష్టల పాలైన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఏపార్టీ ముందు కు రాలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒంటరిపోరుకు దిగింది. ఒక్కసీటు దక్కకపోగా డిపాజిట్లను కోల్పోయింది. చతికిలపడిన కాంగ్రెస్‌కు కొంతవరకు జవసత్వాలుగా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ అధిష్టానంపై అలిగి పార్టీ నుంచి వైదొలిగారు. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న జ్ఞానదేశికన్‌ను సైతం తనతో తెచ్చుకున్నారు. గతంలోకాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా)ను పునరుద్ధరించారు. జీకేవీ బలం, బలగమంతా కాంగ్రెస్‌లోనే ఉండడంతో బలమైన చీలికతెచ్చారు. 23 మంది టీఎన్‌సీసీ జిల్లా అధ్యక్షులను తమాకాలో చేర్చడంలో ఆయన సఫలీకృతులయ్యూరు.
 
 ప్రజల్లోకి పార్టీ అధినేతలు
 ఈ దశలో పార్టీ బలహీనం కాకుండా చూసే బాధ్యత టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడు ఇళంగోవన్‌పై పడింది. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో కలిసి శనివారం సత్యమూర్తి భవన్‌కు వచ్చిన ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు. తమాకాలోకి వెళ్లిపోయిన 23 మంది జిల్లా అధ్యక్షుల మాటేమిటని ప్రశ్నించగా, 23 మంది వెళ్లిపోయారని మీరంటున్నారు, మరో 43 మంది జల్లా అధ్యక్షులు ఇంకా మావైపే ఉన్నారని నేనంటున్నాను అని సమాధానం ఇచ్చారు. ఖాళీ అయిన 23 జిల్లా అధ్యక్షుల స్థానాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. తమాకాను దీటుగా ఎదుర్కొనే వ్యక్తులను అధ్యక్షులుగా నియమించేందుకు తాను స్వయంగా వెళుతున్నట్లు ప్రకటించారు.
 
 జీకేవీ రెండునెలల పర్యటన
 తమాకా అధ్యక్షుడు జీకేవాసన్ సైతం  ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో రెండు నెలల పర్యటనను ఖరారు చేసుకున్నట్లు శనివారం ప్రకటించారు.  చెరకు రైతులు, కావేరీ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న డెల్టా రైతులను కలుసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తమిళ మానిల కాంగ్రెస్ ఒక మహాశక్తిగా అవతరించడం ఖాయమన్నారు. తమాకాను మరేపార్టీ ఎదుర్కొన లేదన్నారు. ఒకేసారి రెండు ‘కాంగ్రెస్’ల అధినేతలు ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement