మద్యంపై పోరాటం | Vasan elected chief of Tamil Maanila Congress | Sakshi
Sakshi News home page

మద్యంపై పోరాటం

Apr 25 2015 2:57 AM | Updated on Aug 17 2018 7:49 PM

కామరాజనాడార్, తన తండ్రి జీకే మూపనార్‌లను పార్టీ అవమానించిందని ఆవేదన చెందిన జీకే వాసన్..

రాష్ట్రంలో మద్యనిషేధం సాధన కోసం పార్టీ శాయశక్తులా పోరాడుతుందని తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. తమాక తొలి సర్వసభ్య సమావేశం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు.            
చెన్నై, సాక్షి ప్రతినిధి: కామరాజనాడార్, తన తండ్రి జీకే మూపనార్‌లను పార్టీ అవమానించిందని ఆవేదన చెందిన జీకే వాసన్..  కాంగ్రెస్ అధిష్టానంతో విభే దించారు. తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరించి సొంతకుంపటిని పెట్టుకున్నారు.  

జీకేవాసన్ పార్టీ  అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీకే నివాసం ఆళ్వార్‌పేట నుంచి వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి మండపం వరకు పార్టీ స్వాగత ద్వారాలు, తోరణాలు, పతాకాలు దారిపొడవునా వెల్లివిరిశాయి.  రాష్ట్రం నలుముల నుండి పెద్ద ఎత్తున హాజరైన అభిమాన జనసందోహం సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు.

జీకే మూపనార్, కామరాజనాడార్ వాళ్గ (వర్దిల్లాలి) అంటూ కార్యకర్తలు చేసిన జయజయధ్వానాలు సమావేశ ప్రాంగణంలో మిన్నంటాయి. సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా రెండువేల మందికి ఆహ్వానాలు పంపారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన కార్యకర్తలు అక్కడి కౌంటర్‌లో రూ.500 లు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జీకేవాసన్ సభా ప్రాంగణానికి చేరుకోగా అభిమానులు హర్షధ్వానాలు చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేయగానే సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవికి జీకేవాసన్ నామినేషన్ దాఖలు చేయగా ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జ్ఞానదేశికన్ ప్రకటించారు.
 
తీర్మానాలు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి, వాటిని పరిష్కరిచగలిగే సత్తా ఉన్న జీకే వాసన్ నేతృత్వంలో పనిచేస్తూ  అండగా ఉంటామని తీర్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని నియమించే హక్కును ఆయనకే కల్పిస్తున్నాము. రాష్ట్రంలో మరలా కామరాజనాడార్ పాలన కోసం ప్రజలంతా జీకేవీకి అండగా నిలవాలని విజ్ఞప్తి. పరిశ్రమలతోపాటూ రైతుల సంక్షేమాన్ని కాపాడాలి, విద్యుత్ కోతలు లేని సరఫరాను అందించాలి, దేశంలో లోక్‌పాల్, రాష్ట్రంలో లోకాయుక్తా న్యాయస్థానాలను నెలకొల్పాలి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదించాలి...తదితర తీర్మానాలను చేశారు.

వందరోజులు ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని కోరారు. నిరుద్యోగుల విద్యా రుణాలను మాఫీ చేయాలని తీర్మానించారు. ఎర్రచందన స్మగ్లింగ్ మాఫియాలను, వారికి సహకరించే అధికారులను ఏపీ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని, కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు తలా రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
 
కాపురాలు కూలుస్తున్న మద్యం: రాష్ట్రంలో ఏరులైపారుతున్న మద్యం ఎన్నో కాపురాలను కూలుస్తోందని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, యువకుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని తాము వత్తిడిచేస్తున్నామని తీర్మానించారు. మే 31వ తేదీలోగా సంపూర్ణ మద్య నిషేధంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయని పక్షంలో రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపడతామని తీర్మానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement