నేడు చెన్నైకి మోడీ రాక | today,narendra coming to chennai | Sakshi
Sakshi News home page

నేడు చెన్నైకి మోడీ రాక

Feb 8 2014 2:13 AM | Updated on Aug 15 2018 2:14 PM

దేశంలో ఎన్నికల వేడి రాజుకోకముందే గత ఏడాది ఆగస్టులో తిరుచ్చిలో నిర్వహించిన సభలో మోడీ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసింది.

 భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం చెన్నైకి రానున్నారు. నగర శివారులోని వండలూరులో  జరగనున్న ప్రచార సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీని కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.         
 
  చెన్నై, సాక్షి ప్రతినిధి:
 దేశంలో ఎన్నికల వేడి రాజుకోకముందే గత ఏడాది ఆగస్టులో తిరుచ్చిలో నిర్వహించిన సభలో మోడీ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసింది. ఆ తరువాత మరోసారి మోడీ చెన్నైకి వచ్చారు. ఈక్రమంలో రాష్ట్రంలో పార్టీ బాగా పుంజుకుంది. మరో నెలరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో జరుపుతున్న సభ కావడం తో బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. వంద ఎకరాల సువిశాల స్థలంలో 160 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో పార్లమెంటు భవనం నమూనాతో స్టేజీ ఏర్పాటు చేశారు. పదిలక్షల మంది సభకు హాజరుకాగలరని అంచనావేస్తున్నారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు పది ఏర్పాటు చేశారు. 40 వేల వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా 13 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు.
 
 తీవ్రవాదుల హెచ్చరిక-భారీ భద్రత
 నరేంద్రమోడీని తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించి ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న తీవ్రవాదుల వల్ల మోడీకి ముప్ప పొంచి ఉందని అనుమానిస్తున్నారు. పాత ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో మోడీ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయన చుట్టూ ఐదంచెల భద్రత అమల్లో ఉంటుంది. సభ జరుగుతున్నంత సేపు ఆకాశమార్గాన హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి 7 గంటలకే పోలీసులు సభా ప్రాంగణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నగర కమిషనర్ జార్జ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. మోడీ సభకు ప్రజలను ఆకర్షించేలా పార్టీ నేతలు తాంబరంలో శుక్రవారం నమో టీ స్టాల్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా అందజేశారు. సభ ముగిసిన వెంటనే మోడీ నగరంలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో బస చేస్తారు. శనివారం ఉదయం ఎస్‌ఆర్‌ఎమ్ వర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు.
 
 బీజేపీపై కుట్ర : పొన్
 వివిధ ప్రాంతీయ పార్టీల కూటములతో భారతీయ జనతా పార్టీ విజయవంతంగా ముం దుకు వెళుతుండగా చూసి ఓర్వలేని కొందరు తమపై కుట్రపన్నుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. డీఎంకేతో తాము పొత్తు చర్చలు సాగిస్తున్నామని, ఈ కారణంగా కినుక వహించిన నరేంద్రమోడీ ఈనెల ఎనిమిదో తేదీన వండలూరులో జరిగే సభకు హాజరుకావడం లేదన్న దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పొత్తు చర్చలు జరగనేలేదంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న వదంతులను నమ్మరాదని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement