రైతుల సమస్యలపై సోమవారం శాసనసభ భవనంవైపు దూసుకొచ్చిన ..
సాక్షి, ముంబై: రైతుల సమస్యలపై సోమవారం శాసనసభ భవనంవైపు దూసుకొచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ తొలుత వీరంతా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరంతా శాసనసభ వైపు దూసుకువస్తుండడాన్ని గమనించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే ఆందోళనకారులు పోలీసులను పక్కకునెట్టేసి బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తమని అణిచివేసే ప్రయత్నం చేసిందని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వజిత్ కదం ఆరోపించారు. అయితే బారికేడ్లను చేధించుకుని ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించినందువల్లనే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు సమర్ధించుకున్నారు.