బీజేపీలోకి యడ్డి రాకపై త్వరలో నిర్ణయం | The decision of the official regime rakapai | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి యడ్డి రాకపై త్వరలో నిర్ణయం

Nov 24 2013 3:22 AM | Updated on Mar 29 2019 9:18 PM

రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి తీసుకు రావాల్సిన ఆగత్యం ఏర్పడిందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు.

= ఢిల్లీలో గడ్కరీ వెల్లడి
 =  కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాలి
 = యడ్డి అనుయాయుల్లో నూతనోత్సాహం

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి తీసుకు రావాల్సిన ఆగత్యం ఏర్పడిందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన ప్రస్తుత తరుణంలో యడ్యూరప్ప విషయమై అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై ఆయన అనుయాయులు తీవ్రంగా మదనపడుతున్నారు.

బీజేపీ నుంచి సరైన ఆహ్వానం అందకపోవడంతో ఒకానొక దశలో యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అంతకు ముందు నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆకాంక్ష అంటూ, బీజేపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎనిమిది స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గత ఆదివారం నగరంలో మోడీ సభ జరిగినప్పుడు బీజేపీలోని యడ్యూరప్ప అనుయాయులకు చేదు అనుభవం ఎదురైంది. వారినెవరూ పెద్దగా  పట్టించుకోలేదు. వేదికపైకి ఎవరినీ ఆహ్వానించ లేదు.

ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వెళ్లి, అధిష్టానంతో చర్చలు జరపాలని యడ్యూరప్ప వర్గీయులు నిర్ణయించారు. బీజేపీలోకి యడ్యూరప్పను తీసుకు రాకపోతే పార్టీలో తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వారిలో ఉత్సాహాన్ని నింపాయి.
 
యడ్యూరప్పకు ఈడీ నోటీసు


 ఈ పరిణామ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) యడ్యూరప్పకు శనివారం నోటీసులు జారీ చేసింది. నగరంలోని రాచేనహళ్లిలో జరిగిన డీనోటిఫికేషన్ వ్యవహారంలో యడ్యూరప్ప కుటుంబానికి ముడుపులు ముట్టాయనే ఆరోపణపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. డీనోటిఫికేషన్ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని ప్రేరణ ట్రస్టుకు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ మేరకు మీ ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదని ప్రశ్నిస్తూ ఈడీ నోటీసులిచ్చింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement