మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు | Peoples Star Narayana Murthy Lessons To The Media Over English Medium In Schools, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు

May 20 2025 1:47 PM | Updated on May 20 2025 3:11 PM

Peoples Star Narayana Murthy Lessons To The Media

పక్షపాతం వద్దని, ప్రజాపక్షం ఉండాలని హితబోధ

ఇంగ్లీష్ మీడియం చదువులతోనే ప్రగతి అని స్పష్టీకరణ

పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు పేదలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే తన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వెల్లడించగలిగే ధైర్యం కలిగిన ఒకే ఒక్క సినీ నటుడు నారాయణమూర్తి.

ఆయన ఎవరిని అయినా మంచి చేసుకోవడం కోసమో మచ్చిక చేసుకోవడం కోసమో మాట్లాడరు. కెరీర్ కోసము.. సినీ  అవకాశాల కోసం భజన చేయడం అసలు ఉండదు.. అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరతెన్నులను తూర్పారబట్టారు. సమాజంలో మీడియా బాధ్యతను.. సమాజ మనుగడలో మీడియా పాత్రను దాన్ని ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడలను ఈ పీపుల్స్ స్టార్ పెద్దల సమక్షంలోనే ఎండగట్టారు.

కొన్ని పత్రికలు, కొంతమంది కోసం.. కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నాయని.. తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్న ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయన కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తోందని నారాయణమూర్తి దుయ్యబట్టారు.

మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తూ మనుగడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి ఏం లాభం అని ఆయన మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల సమక్షంలోనే దులిపి ఆరేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు. నారాయణమూర్తి మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అని.. చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని.. విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయటపెట్టారని ఎప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగులు మొదలయ్యాయి.

ఇంగ్లీష్ మీడియం చదవాలండి
దీంతోపాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు. వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రారంభించిన సంపాదించి న్యాయ స్థానాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ అంశం కూడా గతంలో వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టిన అంశాన్ని పాత్రికేయులు ప్రజలు గుర్తు చేసుకున్నారు.

ఆనాడు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆనాటి వైఎస్ జగన్ పాలనను గుర్తుచేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు.. ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని అంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement