కోటీశ్వరులయ్యేందుకు చోరీలు | TEN KG gold robbery attempt in chennai | Sakshi
Sakshi News home page

కోటీశ్వరులయ్యేందుకు చోరీలు

Jun 25 2015 8:32 AM | Updated on Aug 30 2018 5:24 PM

కోటీశ్వరులయ్యేందుకు చోరీలు - Sakshi

కోటీశ్వరులయ్యేందుకు చోరీలు

కారును బైక్‌తో ఢీకొట్టి అందులోని పదికిలోల బంగారు అపహరణ యత్నం భగ్నమైంది.

చెన్నై : కారును బైక్‌తో ఢీకొట్టి అందులోని పదికిలోల బంగారం అపహరణ యత్నం భగ్నమైంది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై సౌకార్‌పేట తిరుపల్లివీధిలో జయ్‌మాతాజీ కొరియర్ సర్వీస్‌సెంటర్ ఉంది. ఈ కొరియర్ సర్వీసు ద్వారా 10 కిలోల బంగారాన్ని భద్రం చేసి ఉన్న ఒక పార్శిల్‌ను ముంబయికి విమానం ద్వారా పంపాల్సి ఉంది. ఈ కొరియర్ సెంటర్‌లో పనిచేసే వీరేంద్ర (27), రతన్ (22), సందీప్ (26) సదరు పార్శిల్‌ను తీసుకుని మంగళవారం రాత్రి 11 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరారు.
 
వీరేంద్ర కారును నడుపుతుండగా, మిగిలిన ఇద్దరు వెనుక సీట్లో కూర్చున్నారు. అన్నాశాలై మీదుగా సైదాపేటను దాటుతున్న సమయంలో మూడు బైక్‌లలో ఆరుగురు వ్యక్తులు అతివేగంగా కారును వెంటపడి కొందరు ముందుభాగంలో మరికొందరు వెనుకభాగంలో బైక్‌లను నిలిపివేసి కారును ఆపివేశారు. వాళ్లు ... బిడ్డను కారుతో ఢీకొట్టి వెళ్లిపోతున్నావా అంటూ వీరేంద్రతో గొడవకు దిగి దాడిచేశారు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు కారును చుట్టుమట్టారు. ఆగంతకుల మాటలు నమ్మిన జనం... వీరేంద్ర, తదితరులపై తీవ్రంగా దాడి చేశారు. సందట్లో సడేమియాగా బంగారం పార్శిల్‌ను ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లే  ప్రయత్నం చేస్తుండగా గమనించిన రతన్ కేకలు పెట్టాడు.
 
 బైక్‌లో వచ్చిన ఐదుగురు, కారులోని సందీప్ పరారయ్యారు. చూలైమేడుకు చెందిన సెంథిల్‌కుమార్ (29) పట్టుపడ్డాడు. పోలీసులు అతన్ని విచారించగా, బంగారం అపహరణ కోసమే ఈ నాటకం ఆడినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వెంటనే కంట్రోలు రూంకు ఫోన్ చేసి  సమాచారం ఇచ్చారు.
 
 కోటీశ్వరులయ్యేందుకు చోరీలు:
 సెంథిల్ వాంగ్మూలం ప్రకారం, వడపళినికి చెందిన సెల్వకుమార్ (21), చూలైమేడుకు చెందిన అశోక్‌కుమార్ (34), కోడంబాక్కం ప్రసాద్ (30), తాంబరం మణికంఠన్, డాక్లస్, ప్యారిస్ అహ్మద్ అలియాస్ కౌశిల్, నేను స్నేహితులం. దారినపోయేవారిని బెదిరించి డబ్బులాక్కోడం పరిపాటి. వక్రమార్గాల ద్వారా కోటీశ్వరులం కావాలని, కారులు, బంగ్లాలు కొనుగోలు చేయాలని భావించాం. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో దొంగతనాలకు దిగాం. కొరియర్ కంపెనీల పనిచేసే సందీప్‌తో పరిచయం కాగా బంగారు ఎగుమతుల విషయం అతని ద్వారా తెలిసింది.
 
పథకం ప్రకారం మంగళవారం రాత్రి పదికిలోల బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకుని నాటకమాడాం. జనానికి నాపై సందేహం వచ్చి పట్టుకోగానే నాతోటి మిత్రులు పరారయ్యారని చెప్పాడు. సైదాపేట పోలీసులు కేసు నమోదు చేసి సెంథిల్‌కుమార్, సెల్వకుమార్, అశోక్‌కుమార్, ప్రసాద్, మణికంఠన్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement