పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న అసమగ్రంగా ఉన్న తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు ప్రకటించాలని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలంగాణవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.
సాక్షి, ముంబై: పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న అసమగ్రంగా ఉన్న తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు ప్రకటించాలని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలంగాణవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ముంబైలోని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ కార్మిక సంఘం, ముంబై ఎలక్ట్రికల్ ఎంప్లైస్ యూనియన్‌తోపాటు బాంద్రా, ఖార్, దారావి, విలేపార్లేలోని తెలంగాణ సంఘం ప్రతినిధులు చంద్రాబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్దవ్‌తో భేటీ అనంతరం ఆయన బయటికి వెళ్లే సమయంలో కారును అడ్డుకొని వినతిపత్రాన్ని సమర్పించేందుకు ప్రయత్నించారు. అయినా పట్టించుకోకపోవడంతో అప్పటికే నల్లజెండాలు చేతపట్టుకుని జై తెలంగాణ , చంద్రాబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న చంద్రబాబు సమన్యాయం పేరుతో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఉద్దవ్‌ఠాక్రే నివాసానికి సమీపంలోని కళానగర్ ప్రధాన ద్వారం వద్ద సుమారు అరగంటపాటు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. వీరిలో మచ్చ ప్రభాకర్ , గ్యారా శేఖర్, పిట్టల గణేష్, జట్ట కృష్ట, పుప్పాల చిన్న సత్తయ్య , రాంరెడ్డి, మోకు నర్సిరెడ్డి, లింగం, సిద్దుల చంద్రయ్య, జంపయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బాబు, కిరణ్‌ల దిష్టిబొమ్మల దహనం
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను ఐఐటీ పవాయిలోని రమాబాయినగర్‌లో తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక సభ్యులు దహనం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశం చివరి గట్టం చేరుకున్న తరుణంలో ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ద్రోహులని నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో శేఖర్ గ్యారా, అక్కెకనపెల్లి దుర్గేష్, సోమలబోని అంజయ్య, పల్లె గోవింద్, వెంకటేష్ గుడిగుంట్ల, నరిగే రామలింగం, పెంట మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.