మెట్రోలో గడబిడ

Technical error in bangalore metro - Sakshi

ఎనిమిది నిమిషాలు నిలిచిపోయిన రైలు

తలుపులు తెరుచుకోక బోగీల్లోనే బందీలైన ప్రయాణికులు

ఊపిరాడక తీవ్ర అవస్థలు

నిర్వాకంపై ఆగ్రహావేశాలు

సాక్షి, బెంగళూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో రైలు కొద్ది నిమిషాల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10:17 గంటలకు మైసూరు రోడ్‌ నుంచి బయ్యప్పనహళ్లికి బయలుదేరిన మెట్రోరైలు కబ్బన్‌పార్క్‌ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు రెండుసార్లు ఆగిపోతున్నట్లుగా అనిపించింది. ఎలాగో కబ్బన్‌స్టేషన్‌కు చేరుకోగానే సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు తలుపులు తెరుచుకోలేదు. బోగీల్లో ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. గాలి సరిగా ఆడక కంగారు పడ్డారు. మెట్రో సిబ్బంది బయట నుంచి చేసిన సూచనలతో ఎగ్జిట్‌ ద్వారాల వద్దనున్న అత్యవరసన బటన్‌ను ఒత్తడంతో ఎగ్జిట్‌ ద్వారాలు తెరుచుకోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అధికారులతో ప్రయాణికుల వాగ్వాదం
వెంటనే రైలు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో మెట్రో అధికారులు, సిబ్బందితో జరిగిన ఘటనపై వాగ్వాదానికి దిగారు. అసలే భూగర్భంలో ప్రయాణించే రైలులో ఇటువంటి అనుకోని ఘటనలు చోటుచేసుకున్నపుడు ఏం చేయాలనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు. రైలులో ఏసీ కూడా సరిగా పనిచేయకుపోవడాన్ని కూడా పట్టించుకోలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది నిమిషాలు పాటు రైళ్లో ఊపిరి ఆడక వందలాది మంది అగచాట్లు పడ్డామని, ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యులెవరని మెట్రో అధికారులపై మండిపడ్డారు.

హఠాత్తుగా కదిలిన రైలు.. మళ్లీ ఆగ్రహం
అదే సమయంలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రోరైలు ఎటువంటి సూచన లేకుండా ఒక్కసారిగా ముందుకు కదలడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించాలంటూ పట్టుబట్టారు. అధికారులు, సిబ్బంది ఫోన్‌ల ద్వారా చాలాసేపు ప్రయత్నించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో మరోసారి ఇటువంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహిస్తామని, ఈ ఒక్కసారికి మన్నించాలంటూ కబ్బన్‌పార్క్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది వేడుకోవడంతో ప్రయాణికులు శాంతించారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top