కాబోయే భర్తను హత్య చేయించిన శుభకు బెయిల్ | Supreme court grants bail to shubha in girish murder case | Sakshi
Sakshi News home page

కాబోయే భర్తను హత్య చేయించిన శుభకు బెయిల్

Aug 12 2014 8:13 AM | Updated on Sep 2 2018 5:20 PM

కాబోయే భర్తను హత్య చేయించిన శుభకు బెయిల్ - Sakshi

కాబోయే భర్తను హత్య చేయించిన శుభకు బెయిల్

కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితురాలు శుభకు సుప్రీం కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

బెంగళూరు : కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితురాలు శుభకు సుప్రీం కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వివరాలు..  బనశంకరి రెండవ స్టేజ్, 23వ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న వెంకటేశ్, పుష్పవల్లి కుమారుడు గిరీష్ (27). వీరి ఇంటి సమీపంలో నివాసముంటున్న ప్రముఖ క్రిమినల్ న్యాయవాది శంకర నారాయణ కుమార్తె శుభ (22). 15 ఏళ్లగా శంకరనారాయణ, వెంకటేశ్ కుటుంబ సభ్యులు స్నేహితులు.

ఇరు కుటుంబాల పెద్దలు గిరీష్, శుభల వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గిరీష్, శుభ అంగీకరించారు. 2003లో నవంబర్ 30న వీరి నిశ్చితార్థం జరిగింది. 2004 ఏప్రిల్ 11న పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే శుభ అతని జూని యర్ అరుణ్ వర్మను ప్రేమించింది. ఈ విషయం ఇంటిలో చెప్పలేదు. ప్రియుడితో కలిసి గిరీష్ హత్య చేయడానికి  పక్కా ప్లాన్ వేసింది. 2003 డిసెంబర్ 3వ తేదీ రాత్రి గిరీష్, శుభ హెచ్‌ఏఎల్ రోడ్డులోని హోటల్ కు వెళ్లి భోజనం చేశారు.

అనంతరం ఇంటికి వె ళ్తూ మార్గం మధ్యలో దొమ్మలూరు- కోరమంగల రింగ్ రోడ్డులోని విమానాల ల్యాండింగ్ పాయింట్ దగ్గర బైక్ నిలపాలని శుభ చెప్పింది. దీంతో బైక్ పార్క్ చేసి అక్కడ ఉండిపోయారు. అంతలో అరుణ్ వర్మ, అతని స్నేహితులు వెంకటేశ్, దినకర్ అలియాస్ దినేష్ అక్కడి వచ్చి గిరీష్ తలపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. గిరీష్ కుప్పకూలడంతో అరుణ్ వర్మతో సహ ముగ్గురు పరారైనారు. శుభ గిరీష్‌ను మణిపాల్ ఆస్పత్రికి తరలించింది.

గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని పోలీసులకు, గిరీష్ కుటుంబ సభ్యులను నమ్మించింది. కోలుకోలేక గిరీష్ మరణించాడు. శుభపై అనుమానం వచ్చిన గిరీష్ సోదరి సునీత వివేక్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుభ ఫోన్ కాల్స్‌ను పరిశీలిచడంతో అసలు విషయం వెలుగు చూసింది. 2004 జనవరి 28వ తేదీన శుభతో పాటు ఆమె ప్రియుడు అరుణ్ వర్మ, దినకర్, వెంకటేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన ఇక్కడి 17వ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

అరుణ్ వర్మకు రూ. 50 వేలు, వెంకటేశ్‌కు రూ. లక్ష, దినేష్‌కు రూ. 50 వేలు, నాలుగవ ఆరోపి శుభకు రూ. 75 వేలు అపరాధరుసుం విధించారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
 హైకోర్టు న్యాయమూర్తులు ఎం.ఎస్. పచ్చాపుర, ఎన్, ఆనంద్ నేతృత్వలోని ద్విసభ్య బెంచ్ కింద కోర్టు తీర్పును ఖరారు చేశారు. చివరికి నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  దీంతో అత్యున్నత న్యాయస్థానం శుభకు  సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement