
చిన్న వివాదం.. ప్రాణం తీసింది
చిన్ననాటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ఆ యువకులిద్దరూ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ..
బెంగళూరు: చిన్ననాటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ఆ యువకులిద్దరూ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అయితే, వారి మధ్య తలెత్తిన చిన్న వివాదం క్షణికావేశంలో ఒకరి ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాళ పట్టణంలో జరిగింది. సోదరుల పిల్లలైన రంజిత్ (26), రాజేశ్ (24) చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లోనే పెరిగారు. ఇద్దరి మధ్య ఎంతో ఆప్యాయత, చనువు ఉండేది. అయితే, కొంతకాలంగా ఇద్దరి మధ్య ఏదో విషయమై మనస్పర్థలు చోటుచేసున్నాయి.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలసి బార్‌కు వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో గొడవపడగా బార్ సిబ్బంది ఇద్దరికి సర్దిచెప్పి ఇళ్లకు పంపారు. అయితే, రంజిత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న రాజేశ్ అర్థరాత్రి కరెంట్ పోవడంతో ఇదే అదునుగా భావించి రంజిత్ ఇంట్లోకి చొరబడి అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. రంజిత్ అరుపులు విని బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు కత్తిపోట్లకు గురైన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్ చేశారు.