కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, టీవీ యాంకర్ అమృతారాయ్ ప్రేమ విషయంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు.
సాక్షి, ముంబై : కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, టీవీ యాంకర్ అమృతారాయ్ ప్రేమ విషయంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. సామ్నాలో శనివారం ‘చలా ప్రేమాలా లాగా..!’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రకటనల వీరుడుగా ముద్రపడ్డ దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ప్రేమవీరుడిగా మారారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాగూ అధికారం దూరమవుతుంది కాబట్టి.. పెద్దగా పని ఉండదని కాబోలు.. కాంగ్రెస్ పెద్దలు కొందరు ఇలా ప్రేమ వ్యవహారాలు ప్రారంభించారేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నాయకులు ప్రేమ వ్యవహారాల కారణంగా చర్చల్లో నిలుస్తుండడం యువరాజుకి ప్రేరణగా మారుతుందా..? అనే ప్రశ్న అనేక మంది మనసులో మెదులుతోందని రాహుల్ గాంధీకి కూడా చురకలంటించారు.
‘కాంగ్రెస్ నేత ఎన్ డి తివారీ సైతం 90 ఏళ్ల ముదిమి వయసులోనూ తండ్రి కావచ్చని అందరికి తెలిసేలా చేశారు.. పాత ప్రేమవ్యవహారం అంగీకరించి రోహిత్ శర్మకు తానే తండ్రినని అంగీకరించారు.. మరోవైపు దివంగత ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆర్ కె ధవన్ కూడా 75 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కారు. శశిథరూర్, ఇటీవల మృతిచెందిన సునందా పుష్కర్ ప్రేమ జంటనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మహారాజు దిగ్విజయ్ సింగ్ ప్రేమ విషయం ప్రజలముందుకు వచ్చింది. ఇలా ప్రేమవ్యవహారం బయటపడిన వారందరిని మరాఠీలో ‘జరఠ్‌రావ్’ (దేవదాసులు)గా పేర్కొంటాం.. ఈ దేవదాసులందరూ తమ ప్రేమవిషయాలను బయటపెడుతూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలపెకైక్కుతున్నారు.. అయితే దేశంలోని మోస్ట్ ఎలిజిబల్ బ్యాచ్‌లర్ శ్రీమాన్ రాహుల్‌గాంధీ మాత్రం ఇంకా ప్రేమకోసం వెతుకులాటలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ఇతరులు రాహుల్‌కు ప్రేమవిషయంలో తగిన సల హాలు, సూచనలు చేసి యువరాజు కల్యాణం చేయడంలో తప్పేమీలేదు..’ అని ఎద్దేవా చేశారు.