సినీ దర్శకుడిపై నిర్మాత ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడిపై నిర్మాత ఫిర్యాదు

Published Wed, Aug 6 2014 11:59 AM

Producer Complaint to Chennai police on Cinema Director

చెన్నై: సినీ దర్శకుడు మోసానికి పాల్పడ్డాడంటూ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ఈగో. ఈ చిత్ర ఓవర్‌సీస్ హక్కుల్ని వేందర్ మూవీస్ సంస్థ కొనుగోలు చేసి ఆ తరువాత శంకరనారాయణన్ అనే వ్యక్తికి విక్రయించింది. ఆయన నుంచి ఎఫ్‌సీఎస్ క్రియేషన్ అధినేత వీరశేఖర్ ఈగో ఓవర్‌సీస్ హక్కులను పొందారు. ఈయన నుంచి సేతురామన్ ఈగో చిత్ర ఓవర్‌సీస్ హక్కుల్ని పొందారు. ఆయన ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చెయ్యడానికి అక్కడి అస్ట్రో టీవీ సంస్థను సంప్రదించారు.
 
 అయితే అదే చిత్రం హక్కులు తన వద్ద ఉన్నట్టు మరో వ్యక్తి తమను సంప్రదించారని అస్ట్రో టీవీ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనిపై అసలైన హక్కుదారులు ఎవరన్న విషయం గురించి ప్రశ్నించారు. అయితే ఈగో చిత్ర హక్కులను మరో వ్యక్తికి చిత్ర దర్శకుడు శక్తివేల్ విక్రయించినట్లు తెలిసింది. దీంతో సేతుమాధవన్ దర్శకుడు శక్తివేల్‌తో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లోఉంది. దీంతో సేతురామన్ స్థానిక విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో దర్శకుడు శక్తివేల్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement