ప్రజలు - ప్రభుత్వం మధ్య ‘ఆప్లే సర్కార్’ | Sakshi
Sakshi News home page

ప్రజలు - ప్రభుత్వం మధ్య ‘ఆప్లే సర్కార్’

Published Tue, Jan 27 2015 10:58 PM

People - government 'Sarkar applay'

ముంబై:  ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్షమైన, సన్నిహితమైన సంబంధాలను నెలకొల్పేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారితమైన వేదికను ‘ఆప్లే సర్కార్’ పేరిట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేందుకు ఈ వెబ్‌సైట్ అవసరమైన పారదర్శకతను అందించగలదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.

రానున్న రోజుల్లో ఆప్లే సర్కార్‌ను ప్రధాన వెబ్ పోర్టల్‌గా రూపుదిద్దుతామని, సేవాహక్కు చట్టాన్ని కూడా దీనికి అనుసంధానం చేస్తామని తెలిపారు. సేవా హక్కు ముసాయిదా బిల్లును ప్రజల సూచనలు, అభిప్రాయాల కోసం అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్లే సర్కార్ వెబ్‌పోర్టల్ పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక కటాఫ్ తేదీని నిర్ణయిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ చెప్పారు.

ఆప్లే సర్కార్ వెబ్‌సైట్‌కు వచ్చిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రాలయలోని ప్రభుత్వ విభాగాల పనితీరు, అవి అందించే సేవలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతామని చెప్పారు. ఇక రెండో దశలో జిల్లా, మున్సిపల్, తెహసిల్ స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలను దానిలో చేరుస్తామని అన్నారు.
 
మహారాష్ట్రలో వ్యాపారంపై ప్రపంచ పెట్టుబడిదారుల ఆసక్తి
సాక్షి, ముంబై: మన రాష్ట్రంలో సమాచార సాంకేతిక రంగం, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అన్నారు. ఐటీ, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్న 30 సమావేశాల్లో తాను పాల్గొన్నానని తెలిపారు.

ఈ రంగాల్లో భాగస్వాములయ్యేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారని, మన రాష్ట్రం వారికి ఏమి ఇవ్వగలదో వివరించానని ఫడ్నవీస్ చెప్పారు. దావోస్ నుంచి సోమవారం ఇక్కడికి తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైనందునే నదుల క్రమబద్ధీకరణ జోన్ (ఆర్‌ఆర్‌జెడ్) విధానాన్ని రద్దు చేశారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ విషయంలో తాము కేంద్ర విధానాన్ని అనుసరిస్తామని అన్నారు.

Advertisement
Advertisement