ఆ జీవకళ వెనుక అసలు రహస్యం

Russian Expert who preserves physical life - Sakshi

ఉత్తరకొరియా నేతల భౌతికకాయాలను భద్రపరుస్తున్న రష్యన్‌ నిపుణులు

మహానేతల భౌతికకాయాలను భద్రపరచడంలో మాస్కో వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోంది. ఇల్విచ్‌ ఉల్వనోవ్‌ వ్లాదిమిర్‌ లెనిన్‌ భౌతికకాయాన్ని అనేక కష్టనష్టాలకోర్చి అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి మాస్కోలో భద్రపరిచారు. తొలిసారిగా కమ్యూనిస్టు మహానేత లెనిన్‌ భౌతికకాయాన్ని ప్రజాసందర్శనార్థం 1924లో లెనిన్‌ ల్యాబ్‌లో ఉంచారు. లెనిన్‌ భౌతికకాయాన్ని అత్యంత భద్రంగా జీవత్వం ఉట్టిపడేలా ఉంచడంలో రష్యన్‌ సాంకేతిక నిపుణుల కృషి గణనీయమైంది. ఆ వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోందని తాజా అధ్యయనం పేర్కొంది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నాన్న, తాత సహా ఉత్తరకొరియాను పాలించిన ముగ్గురు ప్రముఖుల భౌతికకాయాలను ప్యాంగ్యాంగ్‌లోని కుమ్‌సుసాన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ సన్‌ మాన్యుమెంట్‌లో ఉంచారు. అయితే వీరి భౌతిక కాయాలను సుదీర్ఘకాలం పాడవకుండా ఉంచడానికి మాత్రం లెనిన్‌ భౌతికకాయాన్ని ఇంతకాలం భద్రపరుస్తున్న రష్యన్‌ నిపుణుల సాయంతోనే సాధ్యమవుతోందని అధ్యయనకారులు వెల్లడించారు. 

అందిపుచ్చుకున్న సాంకేతికత..
సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వియత్నాం, నార్త్‌ కొరియా అందిపుచ్చుకున్నాయి. తొలిసారి చేసిన ఎంబాల్మింగ్, ఆ తర్వాత ప్రతిసారీ తిరిగి చేసే రీఎంబాల్మింగ్‌ను కూడా మాస్కో ల్యాబ్‌కు చెందిన నిపుణులే నిర్వహిస్తున్నారని అధ్యయనకారుడు బెర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్‌ యార్‌చాక్‌ వెల్లడించారు. రష్యా నిపుణుల దగ్గర ఉత్తరకొరియా, వియత్నాం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా శిక్షణ పొందుతున్నప్పటికీ మొత్తంగా ఎంబాల్మింగ్‌ రహస్యం మాత్రం వారికి అంతుచిక్కలేదు. 

విదేశాల నిధులతో...
1990లో సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం ప్రభుత్వం ల్యాబ్‌ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో విదేశీసేవల ద్వారా నిధులు సమకూర్చుకున్నారని యార్‌చాక్‌ పేర్కొన్నారు. భౌతిక కాయాలను ఉంచిన మాన్యుమెంట్‌ను ఏటా 2 నెలల పాటు మూసి ఉంచుతారు. ఈ సమయంలోనే భౌతిక కాయాలను రష్యాకు చెందిన నిపుణులు రీఎంబాల్మింగ్‌ చేస్తున్నట్లు యార్‌చాక్‌ వెల్లడించారు. 2016లో లెనిన్‌ భౌతిక కాయానికి రీఎంబాల్మింగ్‌ చేసినప్పుడు దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు అయినట్లు మాస్కో వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top