ముంబై మారథాన్‌కు భారీస్పందన | Sakshi
Sakshi News home page

ముంబై మారథాన్‌కు భారీస్పందన

Published Sun, Jan 18 2015 10:02 PM

OP Jaisha qualifies for Beijing WC in style by setting new national record

జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు
సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం ఉదయం జరిగిన స్టాండర్డ్ చాటర్డ్ మారథాన్‌లో ఇథోపియా దేశానికి చెందిన అథ్లెట్లు విజయకేతనం ఎగురవేశారు. ఏకంగా ఐదు పతకాలు పురుష, మహిళ అథ్లెట్లు దక్కించుకున్నారు. ఈసారి ముంబై మారథాన్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రారంభం నుంచి ఉత్కంఠ నెలకొంది. ఇథోపియా, కేనియా దేశాల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఈ మారథాన్‌ను అజాద్‌మైదాన్‌వద్ద ఏర్పాటుచేసిన వేదికపై రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు జెండా చూపించి ప్రారంభించారు.
 
ఫుల్ మారథాన్‌లో పురుష విభాగంలో కాంస్య (బ్రాంజ్) పతకం మినహా మిగతా ఐదు పతకాలు (పురుష విభాగంలో రెండు, మహిళా విభాగంలో మూడు) ఇథోపియా అథ్లెట్లు దక్కించుకున్నారు. మొత్తం 42 కి.మీ. దూరాన్ని (పురుష విభాగంలో)  ఇథోపియాకు చెందిన తేజ్‌ఫాయే అబేరా 2.9.46 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అలాగే డెరేజ్ డెబెలెన్ 2.10.31 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. కేనియాకు చెందిన బ్ల్యూక్ కిబెట్ 2.10.57 సెక్లన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచారు.
 
అదేవిధంగా ఫుల్ మారథాన్‌లో 42 కి.మీ. దూరాన్ని (మహిళ విభాగం) డిన్కేష్ మెకాష్ 2.30 నిమిషాల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచి 41వేల డాలర్ల బహుమతిని చేజిక్కించుకున్నారు. గత ఏడాది నిర్వహించిన మారథాన్‌లో కూడా ఆమె ఇలాగే మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన కుమేషీ సిచాలాకు 2.30.56 సెకన్ల సమయం పట్టగా మూడో స్థానంలో నిలిచిన మార్టీ మెగారాకు 2.31.45 సెకన్ల సమయం పట్టింది.
 
దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైపై ఇప్పటికే ఉగ్రవాదుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో మారథాన్‌లో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు నిర్వీర్యృబందం, రాష్ట్ర భద్రత దళాలను నియమించారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి మార్గదర్శనంలో మారథాన్ వెళ్లే రహదారి వెంబడి అడుగడుగున పోలీసులను మోహరించారు.

ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)కు కూతవేటు దూరంలో ఉన్న ఆజాద్‌మైదాన్ నుంచి ఆదివారం ఉదయం ముంబై మారథాన్ ప్రారంభమైంది. బాంద్రా నుంచి తిరిగి (42 కి.మీ.) ఆజాద్‌మైదాన్‌కు చేరుకుంది. ఇందులో ఫుల్, ఆఫ్ మారథాన్ ఉండగా సుమారు నాలుగు వేలకుపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అథ్లెట్లు సుమారు 150 వరకు ఉండగా 290 మంది వికలాంగులు ఉన్నారు. మిగతా వారిలో ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, పలువురు సినీ నటీ, నటులు, బుల్లి తెర నటులు, సీనియర్ సిటిజన్లు, ముంబై పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement