నాడు నో నేడు ఎస్‌

No objection to Rahul Gandhi  Perarivalan release Pa Ranjith - Sakshi

రాజీవ్‌ హంతకులపై మాట మార్చిన రాహుల్‌

పేరరివాళన్‌ విడుదలపై పా రంజిత్‌ రాయబారం

తాము సిద్ధమన్న మంత్రి కడంబూరు రాజా

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ ముందస్తు విడుదలపై కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. రాజీవ్‌ హంతకులకు క్షమాభిక్షపై గతంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పిన అఖిలభారత కాంగ్రెస్‌ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాజాగా మాటమార్చారు. ‘పేరరివాళన్‌ను ముందుగా విడుదల చేయదలిస్తే ఎలాంటిæ అభ్యంతరం లేదని ప్రకటించారు. సదరు ఖైదీల క్షమాభిక్ష వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండడంతో రాహుల్‌ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేనా అనే అనుమానాలు నెలకొన్నాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజీవ్‌గాంధీ హత్యకు సంబంధించి తమిళనాడులోని వేలూరు సెంట్రల్‌ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో పేరరివాళన్‌ ఒకడు. వేలూరు జిల్లా జోలార్‌పేటకు చెందిన ఇతనిపై సీబీఐ ముఖ్యమైన నేరారోపణలు చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకోసం ఆత్మాహుతి దళం బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను పెరిరవాళనే కొనిచ్చాడనే అభియోగంపై 1991 జూన్‌ 11వ తేదీన అరెస్ట్‌చేసింది. రాజీవ్‌ హత్యకేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పేరరివాళన్‌కు మరణశిక్ష విధించింది. అతనితోపాటు మురుగన్, శాంతన్, నళినిలకు సైతం ఉరిశిక్ష విధించింది. 1998లో టాడా న్యాయస్థానం విధించిన ఈ శిక్షను 1999లో సుప్రీంకోర్టు సైతం ఖరారుచేసింది. ఆ తరువాత పేరరివాళన్‌ విడుదల చేయాలని అనేక సంఘాలు  ఆందోళనలు చేశాయి. అతని తల్లి అర్బుతమ్మాళ్‌ పలువురు నేతలను కలుస్తూ మద్దతు సేకరించారు. అయితే ఈపోరాటాలు సాగుతుండగానే 2014లో పేరరివాళన్‌ తదితరులను ఉరివేసేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

అయితే క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వారు చేసుకున్న విజ్ఞప్తిపై పదేళ్లుగా నిర్ణయం తీసుకోనందున ఉరిశిక్ష వేయకూడదని సుప్రీం కోర్టులో బాధితులు పిటిషన్‌ వేశారు. దీంతో ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువడింది. అంతేగాక, పేరరివాళన్‌ విడుదలపై తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. దీంతో పేరరివాళన్‌ విడుదల ఖాయమనే ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పేరరివాళన్‌ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లోప్రయత్నం చేశారు. చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతించలేదు. దీంతో పేరరివాళన్‌ గత 27 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 1991లో అతడు ఇచ్చిన వాంగ్మూలం తప్పుగా తర్జుమా చేసినందునే మరణిశిక్షకు గురైనాడని కేసు విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రాజీవ్‌ హత్యకేసులో పేరిరవాళన్‌ అమాయకుడనే భావన నెలకొన్నా జైలు నుంచి విడుదలకు అవకాశం ఏర్పడలేదు. అతని తల్లి ఇప్పటికీ కొడుకు విడుదల కోసం పోరాడి అలసిపోయారు.

రంజిత్‌ రాయబారం
రాజీవ్‌ హంతకులు, ముఖ్యంగా పేరరివాళన్‌ ముందస్తు విడుదల అంశం దాదాపు తెరమరుగు కాగా, ప్రముఖ తమిళ దర్శకులు పా రంజిత్‌ రాయబారం చేయడంతో మరలా తెరపైకి వచ్చింది. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్న రంజిత్‌ సుమారు రెండుగంటలపాటూ తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సమయంలో పేరరివాళన్‌ విడుదలకు సహకరించాల్సిందిగా రంజిత్‌ కోరారు. ‘పేరరివాళన్‌ విడుదల విషయంలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని రాహుల్‌ బదులివ్వగా రంజిత్‌ ధన్యవాదాలు తెలిపారు. రంజిత్‌తో కలిసి రాజకీయాలు మాట్లాడుకున్నట్లు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేయడంతోపాటు ఫొటో పెట్టారు.  కాగా, గతంలో సోనియా విజ్ఞప్తి మేరకు నళిని మరణదండన, యావజ్జీవ శిక్షగా మారింది. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో పేరరివాళన్‌ విడుదలయ్యేనా, తల్లి అర్బుతమ్మాళ్‌తోపాటు ఇతరుల కల నెరవేరేనా, రాహుల్‌ విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించేనా అనే అనుమానాలు వరుసపెట్టాయి.

ఆనాడే చుక్కెదురు
మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని భావించిన జయలలితకు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడే చుక్కెదురైంది. అంతేగాక మాజీ ప్రధానిని హత్యచేసిన వారికే క్షమాభిక్షా అంటూ ఆనాడు సాక్షాత్తు రాహుల్‌గాంధీనే అడ్డుపుల్లవేశారు. మరి ఈరోజు అదే వ్యవహారంలో తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని మంత్రి కడంబూరు రాజా చెప్పడం ద్వారా బంతిని కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top