పీవోకేలో ఉగ్రవాద శిబిరాలు లేవు | No militant camps in PoK: Hizbul | Sakshi
Sakshi News home page

పీవోకేలో ఉగ్రవాద శిబిరాలు లేవు

Sep 26 2016 2:09 AM | Updated on Sep 4 2017 2:58 PM

పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడికి భారత్ సన్నాహాలు... సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు... ఉడీ దాడి అనంతరం ఇలా రోజుకో ఊహాగానం.

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోనే ఉగ్రవాదులకు శిక్షణ
నియంత్రణ రేఖ వెంట తాత్కాలిక శిబిరాలు మాత్రమే
మాజీ ఉగ్రవాదుల వెల్లడి

న్యూఢిల్లీ/శ్రీనగర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడికి భారత్ సన్నాహాలు...  సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు... ఉడీ దాడి అనంతరం ఇలా రోజుకో ఊహాగానం. ఈ నేపథ్యంలో అసలు నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కు ఎంత దూరంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజానికి ఎల్‌వోసీకి సమీపంలో ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఉంటే భారత్ దాడి చేసినా ప్రయోజనం ఉంటుంది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎలాంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లేవన్నది మాజీ ఉగ్రవాదులు చెప్తున్న సత్యం. ఈ అంశాన్ని జమ్మూ కశ్మీర్ నిఘా విభాగం ఉన్నతాధికారి సమర్ధించారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై లొంగిపోయిన ఇద్దరు తీవ్రవాదులు ఒక జాతీయ వార్తా సంస్థతో తమ అనుభవాల్ని పంచుకున్నారు.

ముజఫరాబాద్‌లో శిబిరాలు అవాస్తవం
పీవోకేలో  శిక్షణ కార్యక్రమాలు లేవని, శిక్షణ పూర్తయ్యాక మాత్రమే తాత్కాలిక స్థావరాలు, శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని మాజీ ఉగ్రవాదులు తెలిపారు. శిక్షణ శిబిరాలన్నీ అఫ్గానిస్తాన్ సరిహద్దు దగ్గర్లో ఉంటాయన్నారు. వీరు గతంలో హిజ్బుల్ ముజాహిదీన్, అల్ ఉమర్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థల్లో పనిచేశారు. ‘1993లో కశ్మీర్‌కు చెందిన ఎనిమిది మందితో కలిసి పాక్‌కు వెళ్లాను. ఉడీకి 70 కి.మీ.ల దూరంలోని ముజఫరాబాద్(పీవోకే) చేరుకున్నాక... మమ్మల్ని అద్దె ఇంట్లో ఉంచారు. ముజఫరాబాద్‌లోని శిక్షణ శిబిరాల్లో వారం రోజులు సీనియర్ కమాండర్లు జిహాద్, ఇతర సిద్ధాంతాలు చెప్పారు. తర్వాత పాక్-అఫ్గాన్ సరిహద్దుకు తీసుకెళ్లారు. అక్కడ ఏకే-47, గ్రెనేడ్స్, బాంబులు, భుజాలపై నుంచి ప్రయోగించే రాకెట్లతో శిక్షణిచ్చారు. నెలపాటు ఇలా సాగింది. ’ అని మజీద్ తెలిపాడు.

నిజమేనంటున్న నిఘా అధికారులు
శిబిరాల్లోని శిక్షకులంతా పాక్ ఆర్మీ అధికారులు లేదా అఫ్గాన్ ముజాహిదీన్ కమాండర్లేనని మరో మాజీ ఉగ్రవాది షఫీఖ్ తెలిపాడు. ‘ముజఫరాబాద్‌కు వచ్చాక అద్దె ఇంట్లో ఉన్నాం. తర్వాత నలుగురైదుగుర్ని ఒక గ్రూపుగా చేసి ఆయుధాలు, మందుగుండు ఇచ్చి నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి పంపుతారు’ అని అన్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్‌లో పనిచేసిన షఫీఖ్‌కు సైన్యంతో కాల్పుల్లో ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తర్వాత ఐదేళ్లు ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన అతను అరెస్టై కోర్టు ఉత్తర్వులతో విడుదలయ్యాడు. వీరిద్దరి వాదనను జమ్మూ కశ్మీర్ నిఘా విభాగం సీనియర్ అధికారి సమర్థించారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎలాంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లేవు. ముజఫరాబాద్, ఇతర ప్రాంతాలను కేవలం బేస్ క్యాంప్‌లు, ప్రయోగ వేదికలుగా మాత్రమే ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement