మంచమే అంబులెన్స్‌

No Ambulance Service People Using Cots In Orissa - Sakshi

జయపురం : ప్రతి వారికి అందుబాటులో వైద్యసౌకర్యం. ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యాలయం. సమితులకు కనెక్టివిటీ రోడ్లు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే ఫోన్‌ చేసిన వెంటనే 102 అంబులెన్స్‌ కుయ్‌కుయ్‌ మంటూ వచ్చి ఆస్పత్రిలో చేర్చుతుంది. ఈ మాటలు ఎంతో కాలంగా ప్రజలు వింటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో గర్భిణులు పడుతున్న పాట్లు మాత్రం వర్ణనాతీతం. చాలా సందర్భాల్లో రోగులు, గర్భిణులను డోలీలలోనూ, మంచాలపైనా, సైకిళ్ల పైన తీసుకువెళ్తూ నదులు, కొండలు దాటిస్తూ ఆస్పత్రికి వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అటుంటి సంఘటనే బొరిగుమ్మ సమితి రణస్పూర్‌  గ్రామ పంచాయతీలో శుక్రవారం తాండవించింది.

 పంచాయతీలోని రాణిగడ గ్రామ నివాసి మిశ్రా ముదులి భార్య మోతి ముదులి(19) గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన తరువాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని   ఆశా వర్కర్‌ రుకుణ సూచించింది. రాణిగుడ కొండపై ఉన్న ఈ గ్రామానికి రహదారి లేదు. దీంతో ఆమె బంధువులు మోతి ముదులిని మంచంపై కూర్చుండ బెట్టి మోసుకుంటూ బొరిగుమ్మ ఆస్పత్రికి బయలుదేరారు. మూడు కొండలు దాటుతూ మూడు కిలోమీటర్లు మోసుకుని బి.సింగపూర్‌ చేరారు. అక్కడినుంచి ఆటోలో బొరిగుమ్మ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సరిపడా రక్తం ఇక్కడ లేదని, వెంటనే జయపురం సబ్‌డివిజన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

దీంతో వెంటనే ఆమెను జయపురం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అవసరమైన రక్తం సమకూర్చి వైద్యం చేసిన తరువాత ఆమె సృహలోకి వచ్చింది. దీంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. సర్కారు కనికరించాలి ఇలాగే ™రాణిగుడ గ్రామంతో పాటు నాలుగైదు గ్రామాలు కొండలపై ఉన్నాయని, ఆ గ్రామాలకు రహదారులు వేయాలని ఎంతో కాలంగా అధికారులను కోరుతూ వస్తున్నామని అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోయారు. కొండలపై ఉన్నç గ్రామాలలో రోగులు, మహిళలు, గర్భిణులకు వైద్య సౌకర్యం కోసం డోలీకట్టో, మంచాలపైనో మోసుకుంటూ కొండలు దాటుతూ వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వెంటనే తమ గ్రామాలకు రహదారులు వేయాలని కోరుతున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top